న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఎస్సెల్ గ్రూప్ (జీ మీడియా) వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర కేసులో బ్యాంకులు నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ను ఆశ్రయించాలని చూస్తున్నాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో సుభాష్ చంద్ర రూ.6.50 కోట్ల తీర్మాన ప్రతిపాదన ఆమోదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రుణాలిచ్చిన సంస్థలు రూ.22,006.57 కోట్లు రావాలని క్లెయిమ్ చేశాయి మరి. కానీ మెజారిటీ రుణదాతలు (80 శాతానికిపైగా) రూ.6.50 కోట్ల కంపెనీ (సుభాష్ చంద్ర) రిజల్యూషన్ ప్రతిపాదన (అప్పులిచ్చినవారికి రూ.6.25 కోట్లు, ప్రాసెసింగ్ ఖర్చులకు రూ.25 లక్షలు)కే ఓటేశాయి. దీంతో ఏకంగా 99.97 శాతం బకాయిలు రైటాఫ్ అయిపోయాయి.
ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ మరికొన్ని ఎన్సీఎల్టీ తీర్పును ఎన్సీఎల్ఏటీలో సవాల్ చేయాలని భావిస్తున్నాయని సమాచారం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దాదాపు రూ.705 కోట్లు (మొత్తం క్లెయిమ్‌లో 3.17 శాతం) రావాలని క్లెయిమ్ చేసింది. అలాగే యూనియన్ బ్యాంక్‌కు 0.76 శాతం రావాల్సి ఉన్నది. కాగా, రూ.1,322.39 కోట్ల బకాయిలు రావాల్సిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సైతం సవాల్ చేయవచ్చని తెలుస్తున్నది.
ఈ కేసులో మొత్తం 23 క్రెడిటర్లు (అప్పులిచ్చినవారు) ఓటింగ్‌లో పాల్గొన్నారు. తమకు రూ.22,006.57 కోట్లు రావాలని క్లెయిమ్ చేశాయి. అయితే బ్యాంకులు మినహా దాదాపు అన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు రూ.6.50 కోట్ల రిజల్యూషన్ ప్రపోజల్‌కు ఓటేశాయి. ఇక్కడ ఈ
తీర్మాన ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉన్న బ్యాంకుల ఓటింగ్ శాతం 19.186 శాతమే. అయితే అనుకూలంగా ఉన్నవాటి ఓటింగ్ శాతం 80.814 శాతం. దీంతో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్స్రీ కోడ్ (ఐబీసీ) నిబంధనల ప్రకారం ఎన్సీఎల్టీ తుది తీర్పునిచ్చింది. సదరు రుణాలకు వ్యక్తిగత పూచీకత్తుదారుగా ఉన్న సుభాష్ చంద్ర రూ.6.50 కోట్లు చెల్లిస్తే చాలని పేర్కొన్నది.
ఎన్సీఎల్టీలో ఈ కేసు రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా వ్యవహరించిన శివ్ నందన్ శర్మ తీరుపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుభాష్ చంద్రకు వ్యతిరేకంగా వచ్చిన 1,260 వ్యక్తిగత క్లెయిమ్‌లను సమగ్ర రీతిలో పరిశీలించకుండానే ఆమోదించారని ఎన్సీఎల్టీ గుర్తించింది మరి. ఈ క్రమంలోనే రిజల్యూషన్ ప్రపోజల్‌ను వ్యతిరేకించిన బ్యాంకులు సైతం ఓటింగ్‌లో పాల్గొన్న క్రెడిటర్లలో మెజారిటీ క్రెడిటర్లు సుభాష్ చంద్రకు, ఆయన అనుచరులు, అనుబంధ సంస్థలకు చెందినవారేనని ఆరోపిస్తున్నాయి. వీణా ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డైరెక్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ వెంచర్స్, వరల్డ్ క్రెస్ట్ అడ్వైజర్స్ ఎల్ఎల్పీ, లెమనేడ్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎల్ఎల్పీ, కార్ప్‌కాల్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎల్ఎల్పీ రుణగ్రస్తుడి అసోసియేట్ల క్యాటగిరీలో ఉన్నాయని, వీటి ఓటు హక్కును పరిగణనలోకే తీసుకోరాదని బ్యాంకర్లు వాదిస్తున్నారు.
ఇక ఈ ఐదు సంస్థలకే రుణాల క్లెయిమ్‌లలో 60 శాతానికిపైగా వాటా ఉండటం గమనార్హం. అందుకే గోల్మాల్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటింగ్‌లో పాల్గొన్న 23 మంది క్రెడిటర్లలో యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఎల్ బ్యాంక్‌తోపాటు ఐడీబీఐ ట్రస్టీషిప్ (ఫ్రాంక్లిన్ టెంపుల్టన్), ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లు వ్యతిరేకంగా ఓటేశాయి. ఇదిలావుంటే 2024 సెప్టెంబర్‌నాటికి ఐబీసీ కింద 1,051 కంపెనీల కేసుల్లో తీర్మానం చేశారు. ఇందులో రుణదాతలు సుమారు రూ.7.89 లక్షల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. 5 కేసుల్లో క్రెడిటర్లకు 60 శాతానికిపైగానే నష్టం వాటిల్లింది.