న్యూఢిల్లీ, ఆగస్టు 21 : బ్యాంక్ యూనియన్ల సంఘం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ).. ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల్లో ప్రజాస్వామ్యయుత బోర్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే మార్కెట్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పీఎస్‌బీలను పునర్వ్యవస్థీకరించవద్దని, ఉన్నతస్థాయిల్లో తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో బలవంతంగా అమలుపర్చాలని చూడవద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ఓ బహిరంగ లేఖ రాసింది. చిన్న డిపాజిట్లపైనా డిపాజిట్‌దారులకు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడులు అందాలని, బ్యాంక్ శాఖల్లో సరిపడా సిబ్బందిని నియమించడం ద్వారా చిరు రుణగ్రహీతలకు రుణాల మంజూరును మరింత వేగవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా యూఎఫ్‌బీయూ సూచించింది. అంతేగాక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల రుణాల పంపిణీకి బ్యాంకులు తక్కువ వడ్డీకే ప్రజల దగ్గర్నుంచి సేకరించిన డిపాజిట్లను మళ్లించకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా కేంద్రానికి యూఎఫ్‌బీయూ సూచించడం గమనార్హం.
బ్యాంకుల్లో అన్ని బోర్డు స్థాయి ఖాళీలను నిర్దిష్ట, ప్రకటించిన కాలవ్యవధి మేరకే భర్తీ చేయాలని మోదీ సర్కార్‌ను బ్యాంకుల యూనియన్ కోరింది. అలాగే బ్యాంక్ బోర్డుల్లో బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు, డిపాజిటర్లు, రైతులు, ఎంఎస్ఎంఈలు (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు), ఇతర చట్టపరమైన భాగస్వాములకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా డిమాండ్ చేసింది. పీఎస్బీ సంస్కరణలపై ఏదైనా ఉన్నతాధికార
నిపుణుల కమిటీని వేయాలనే యోచన ఉన్నా.. అందులోనూ వ్యవసాయ సంఘాలు, సహకార సంఘాలు, వినియోగదారుల గ్రూపులు, స్వతంత్ర ప్రజా ప్రయోజన నిపుణులతోపాటు వీరందరికి చోటు కల్పించాలన్నది. ఈ కమిటీ ఇచ్చిన తుది నివేదికను తప్పక బహిర్గతం చేయాలని కూడా యూఎఫ్‌బీయూ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
‘వికసిత్ భారత్ కోసం బ్యాంకింగ్’పై త్వరలో ప్రభుత్వం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయబోతున్నదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన ప్రకటన నేపథ్యంలో యూఎఫ్‌బీయూ పైవిధంగా స్పందించింది. అభివృద్ధి చెందిన భారత్ ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా దేశీయ బ్యాంకుల సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కమిటీ సూచనలు, సలహాలు ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. దీంతో బ్యాంకులను సంస్కరించే విషయంలో అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఒంటెద్దు పోకడ తగదని యూఎఫ్‌బీయూ హితవు పలికింది. నిజానికి ఈ ఉన్నతస్థాయి కమిటీని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన బడ్జెట్లోనే మంత్రి ప్రతిపాదించారు. బ్యాంకింగ్ రంగాన్ని సమగ్ర రీతిలో సమీక్షించి, దేశ తదుపరి వృద్ధి అవకాశాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని నాడు మంత్రి పార్లమెంట్లో వివరించారు. అయితే బ్యాంక్ సర్వీస్ చార్జీలను సమీక్షించి, హేతుబద్ధీకరించాలని, అందుబాటు ధరల్లో కనీస బ్యాంకింగ్ సేవలను అందరికీ అందించాలని, ముఖ్యంగా అల్పాదాయ వర్గాలకు బ్యాంకింగ్‌ను దూరం చేయవద్దని యూఎఫ్‌బీయూ అంటున్నది.
వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, తయారీ, సహకార, విద్య, గృహ నిర్మాణం, ఇతర ఉద్యోగ-ఉపాధి కల్పన రంగాల అభివృద్ధికి బ్యాంకులు దోహదపడితేనే దేశాభివృద్ధి సాధ్యమని కూడా యూఎఫ్‌బీయూ గుర్తుచేస్తున్నది. ఇదే సమయంలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకొని, బకాయిల వసూలుకు సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. పాలనాపరమైన వైఫల్యాలకు జవాబుదారీతనం కూడా బ్యాంకింగ్ రంగంలో పెరుగాల్సిన అవసరం ఉందని చెప్పింది. మొత్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల భవిష్యత్తును కేవలం ప్రభుత్వ పెద్దలు, సీనియర్ మేనేజ్మెంట్, ఎంపికచేసిన కొద్దిమంది నిపుణులు నిర్ణయించరాదంటున్న యూఎఫ్‌బీయూ.. ఇందులో బ్యాంక్ ఉద్యోగులు, ట్రేడ్ యూనియన్లు, డిపాజిటర్లు, రుణాలపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న ఆయా ఉత్పాదక రంగాలకు భాగస్వామ్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది.