Bank of Baroda Cuts Interest | కొత్తగా కార్లు కొనే వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) 25 బేసిక్ పాయింట్ల వడ్డీరేటు తగ్గించింది. ఈ విషయమై సోమవారం ఓ ప్రకటన చేసింది. ఇంతకుముందు 7.25 శాతం వడ్డీకి కార్ల రుణాలిచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఇక నుంచి ఏడు శాతానికే రుణాలు అందజేయనున్నది. కార్ల రుణంపై ప్రాసెసింగ్ ఫీజు రూ.1500కు తగ్గించింది. ప్రాసెసింగ్ ఫీజుతోపాటు జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. ఇప్పటికే కార్లు, ఇతర వాహనాల రుణాలు తీసుకున్న వారు, టూ వీలర్ రుణాలపై వడ్డీరేట్లలో మార్పు ఉండదని తెలిపింది.
కరోనా మహమ్మారితో విధించిన లాక్డౌన్తో ఆటోమొబైల్ రంగం కుదేలైంది. అయితే కార్ల రుణాలకు డిమాండ్ క్రమంగా పెరగడంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మార్గం సుగమమైంది. సొంత వాహనాల్లో ప్రయాణించాలని ప్రజానీకం కోరుకుంటున్నారని బ్యాంక్ ఆఫ్ బరోడా మార్టగేజ్ అండ్ అదర్స్ రిటైల్ అసెట్స్ జనరల్ మేనేజర్ హెచ్టీ సోలంకీ తెలిపారు. తమ ఖాతాదారులు చౌకగా కార్లు సొంతం చేసుకోవడానికి వడ్డీరేటు, ప్రాసెసింగ్ ఫీజు తగ్గించామన్నారు.
ఇంతకుముందు ఇండ్ల రుణాలపై వడ్డీరేటు 25 బేసిక్ పాయింట్లు తగ్గిస్తూ బీవోబీ నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం 6.50 శాతం వడ్డీరేటుపై ఇండ్ల రుణాలు మంజూరు చేస్తున్నది. జూన్ నెలాఖరు వరకే ఈ ఆఫర్ పరిమితం అని గత నెల 22న జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నది.