Banks Strike | బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకుల ఉద్యోగులు మరో దఫా సమ్మె చేయనున్నారు. వచ్చేనెల 23, 24 తేదీల్లో సమ్మెలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ (సీటీయూ), అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) సంయుక్తంగా సమ్మెపై ప్రకటన చేశాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని తెలిపాయి. సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధం కావాలని అన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలకు లేఖలు రాసినట్లు ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు.
రెండు కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో గతేడాది మార్చి 15, 16 తేదీల్లో చేపట్టిన నిరసన రసాబాసగా ముగిసింది. బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బ్యాంకింగ్ చట్టాలు (సవరణ) బిల్లు-2021కు వ్యతిరేకంగా బ్యాంకుల ఉద్యోగులు గతేడాది డిసెంబర్ 16,17 తేదీల్లో సమ్మె చేశారు.
ఒకవేళ బ్యాంకు ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు ఉద్యోగులు వచ్చేనెల 23, 24 తేదీల్లో సమ్మెకు వెళితే, 23 నుంచి 27వ తేదీ వరకు బ్యాంకులు పని చేయవు. సమ్మె కారణంగా 23, 24 తేదీల్లో పనులు జరుగవు. 26న నాలుగో శనివారం, 27న ఆదివారం సెలవులు. గత నెలలో జరిగిన సమ్మె వల్ల ఎస్బీఐ, పీఎన్బీ, సెంట్రల్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్‌ల్లో చెక్ క్లియరెన్స్, ఫండ్ ట్రాన్స్ఫర్, డెబిట్ కార్డ్ తదితర కార్యకలాపాలు నిలిచిపోయాయి.