Interest Rates | హైదరాబాద్, సెప్టెంబర్ 12: ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటంతో ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు లేవని ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష బంగారి తెలిపారు. హైదరాబాద్‌లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ)తో కలిసి ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశీయ ఎగుమతులకు ఊతమివ్వడానికి ఎగ్జిమ్ బ్యాంక్ కృషి చేస్తున్నదని, ముఖ్యంగా నిర్మాణ, కెమికల్, ఫార్మా ఆయా రంగాలకు సంబంధించిన సంస్థలకు రుణాలు కూడా ఇచ్చినట్టు తెలిపారు. అంతర్జాతీయంగా అవకాశాలు ఉన్నచోట రుణాలు మంజూరు చేస్తున్నది.
గతంలో ఎంఎస్ఎంఈ రంగాలకు భారీ స్థాయిలోనే రుణాలు మంజూరు చేసినట్టు, భవిష్యత్తులో ఈ రంగానికి రుణాలు పెంచనున్నట్లు ఆమె ప్రకటించారు. ఇప్పటి వరకు 49 ఎంఎస్ఎంఈలకు రూ.650 కోట్ల స్థాయిలో రుణాలు మంజూరు చేసినట్లు, వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంస్థలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే, తెలుగు సినిమాలకు సైతం రుణాలిస్తామని ఆమె చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వితరణలో 12-15 శాతం వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉన్నదన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరినాటికి బ్యాంక్ రూ.1.40 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసింది. వీటిలో నిరర్థక ఆస్తులు ఒక్క శాతం లోపే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.