Axis Bank to Take over Citi | అమెరికా కేంద్రంగా పని చేస్తున్న సిటీ బ్యాంక్ అనుబంధ సిటీ ఇండియాను స్వాధీనం చేసుకునేందుకు దేశంలోనే మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ముందు వరుసలో నిలిచిందని సమాచారం. సిటీ ఇండియా బ్యాంక్ ఆధ్వర్యంలోని రిటైల్ బిజినెస్, క్రెడిట్ కార్డు ఆస్తులను టేకోవర్ చేసుకునేందుకు మొదటి స్థానంలో ఉందని తెలిసింది. ఇంతకుముందు కొటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంకులు బిడ్డింగ్‌లు దాఖలు చేశాయి. భారత్‌లో సిటీ కన్జూమర్ బిజినెస్ విలువ 200 కోట్ల డాలర్లు అని తెలుస్తున్నది.
ఈ మేరకు యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్ గ్రూప్ ఒక ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వినికిడి. తదుపరి దశలో రెండు సంస్థలు ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు ఈ ఒప్పందం ప్రాతిపదిక కానున్నది. యాక్సిస్ బ్యాంక్‌తో ఒప్పందంపై సంతకాలు చేసిన విషయమై మిగతా రెండు బిడ్లు దాఖలు చేసిన కొటక్‌మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంకులకు సిటీబ్యాంక్ యాజమాన్యం సమాచారం ఇచ్చిందని తెలుస్తోంది. ఇండియా సిటీ బ్యాంకు ఆస్తుల విక్రయం ద్వారా 200 కోట్ల డాలర్ల ఆదాయం లభిస్తుందని సిటీ బ్యాంక్ గ్రూప్ అంచనా వేస్తున్నది. ఇంతకుముందే భారత్‌తోపాటు 13 దేశాల్లో కన్జూమర్ బ్యాంకింగ్ నుంచి వైదొలగాలని సిటీ బ్యాంక్ గ్రూప్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.