న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3 : భారతీయ విమానయాన పరిశ్రమకు మళ్లీ చమురు కష్టాలు వచ్చిపడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మరోమారు ఉద్రిక్తతలు తలెత్తడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం దేశీయ మార్కెట్లో విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు పెరిగాయి. లీటర్ రూ.6.28 ఎగబాకింది. ఆగస్టులోనూ ఒకసారి లీటర్ రూ.5 పెరిగిన విషయం తెలిసిందే. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ముదిరితే ధరలు ఇంకా పెరుగవచ్చన్న అంచనాలున్నాయి. ఇది ఏవియేషన్ ఇండస్ట్రీని కలవరపెడుతున్నదిప్పుడు.
పెరుగుతున్న చమురు ధరలు.. ఎయిర్‌లైన్స్ నిర్వహణ ఖర్చులను ఎగదోసేలా ఉన్నాయి. సంస్థాగత నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ వాటానే 35-40 శాతంగా ఉంటుంది మరి. ఈ నేపథ్యంలో అధిక చమురు ధరలు.. ఎయిర్‌లైన్స్ నష్టాలకు దారితీసే ప్రమాదం కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెరిగే అవకాశాలూ లేకపోలేదు. ఇదే జరిగితే ప్రయాణికులపై అదనపు భారం తప్పదని చెప్పవచ్చు. అయితే మార్కెట్లో పోటీ దృష్ట్యా కొన్ని ఎయిర్‌లైన్స్.. అధిక చమురు ధరల భారాన్ని ప్రయాణికులపై మోపకుండా భరించే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. దీనివల్ల ఆయా సంస్థల లాభాలు తగ్గిపోవడమో, నష్టాలు వాటిల్లడమో జరుగుతుందని.. ఇది ఇండస్ట్రీకి అంత మంచి పరిణామం కాదని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న మొదలైన మిడిల్ ఈస్ట్ యుద్ధం.. 6 నెలలు దాటినా ఆగట్లేదు. దీంతో భారత్ సహా చమురు దిగుమతులపై ఆధారపడ్డ చాలా దేశాలకు ఈ వార్ ఇబ్బందికరంగా మారింది. దేశీయ ఇంధన అవసరాలు సుమారు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న సంగతి విదితమే. ఇందులో గల్ఫ్ దేశాల నుంచి హొర్ముజ్ జలసంధి మీదుగా వస్తున్నది ఎక్కువే. ఇరాన్ హొర్ముజ్‌లో రవాణాకు ఆటంకాలు ఏర్పరుస్తుండటంతో భారత్‌కు డిమాండ్‌కు తగ్గ ముడి చమురు రాలేకపోతున్నది. ఫలితంగా దేశంలో ధరలు పెరుగుతున్నాయి. ఇక 15 రోజులకోసారి (ప్రతి నెలా 1, 15 తేదీల్లో) పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, వంట గ్యాస్ సహా అన్ని ఇంధనాల ధరలను అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు సవరిస్తున్నది తెలిసిందే. ఇలా గడిచిన 2 నెలల్లో ఏటీఎఫ్ ధర లీటర్ రూ.11.28 పెరిగింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ రేటు 91 డాలర్లపైనే పలుకుతున్నది. గతంలో 125 డాలర్లుగా నమోదైన సంగతి విదితమే.
పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో ఎయిర్‌లైన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. గురువారం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)లో ఇండిగో షేర్ విలువ రూ.41 పడిపోయి రూ.4,979 వద్ద స్థిరపడింది. స్పైస్‌జెట్ షేర్ కూడా ఒడిదుడుకుల్లో కదలాడుతున్నది. ఒకవేళ పెరిగినా స్వల్ప లాభాలకే పరిమితమవుతున్నది. ఇదిలావుంటే కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాలపైనా చమురు ధరల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో ఇండిగో రూ.238 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని ప్రకటించింది. స్పైస్‌జెట్ సోమవారం ప్రకటించనున్నది. నిజానికి ఇప్పటికే ఆయా విమానయాన సంస్థలు అధిక ఇంధన ధరల భారాన్ని మోయలేక సతమతమవుతున్నాయి. టికెట్ ధరల పెంపుతో ప్రయాణికులపై కొంత భారం మోపినా.. పోటీ కారణంగా మిగతా భారాన్ని దిగమింగక తప్పట్లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే గిరాకీ లేని రూట్లలో సేవలు నిలిపివేస్తున్నాయని, కొత్త రూట్లను ప్రకటించడం లేదని అంటున్నారు. ఇక ఉద్రిక్తతలు, యుద్ధాల కారణంగా పాకిస్థాన్, మిడిల్ ఈస్ట్, ఉక్రెయిన్-రష్యా దేశాల గగన తలాల వినియోగంపై ఆంక్షలుంటున్నాయని, దీంతో ప్రయాణ దూరం పెరుగుతున్నదని ఎయిర్‌లైన్స్ వాపోతున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయంలో లాభాల వాటా బాగా తగ్గిపోతున్నదని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి ప్రస్తుత పరిస్థితులు భారతీయ విమానయాన రంగాన్ని కుదేలు చేస్తున్నాయని చెప్పకతప్పదు.
అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో విమానయాన ఇండస్ట్రీ కోసం కేంద్ర ప్రభుత్వం స్వచ్చంద ధర స్థిరీకరణ పథకాన్ని పరిచయం చేసింది. ఈ స్కీమ్‌లో చేరిన ఎయిర్‌లైన్స్‌కు మూడేండ్లపాటు గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలతో సంబంధం లేకుండా (పెరిగినా, తగ్గినా) లీటర్ రూ.115కే దొరుకుతుంది. పథకంలో చేరని ఎయిర్‌లైన్స్ ఎప్పట్లాగే మార్కెట్ రేట్లకు కొనుగోలు చేయవచ్చు. అయితే ధరలు పెరిగితే భారం పడుతుంది. కానీ తగ్గితే లాభదాయకం. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య చర్చల నేపథ్యంలో ధరలు తగ్గుముఖం పట్టాయి. అప్పుడు సదరు పథకంలో చేరని ఎయిర్‌లైన్స్‌కు తక్కువ ధరకే ఇంధనం లభించింది. కానీ ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం లీటర్ రూ.110గా ఉన్నది. గల్ఫ్ పరిస్థితులనుబట్టి ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా అధిక ధరలతో ఎయిర్‌లైన్స్‌కు నష్టాలు తప్పేలా లేవు. ఏదీఏమైనా పథకంలో చేరిన ఎయిర్‌లైన్స్‌కు ఒక రకంగా, చేరని కంపెనీలకు మరొక రకంగా నష్టాలే మిగులుతున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మాట.