Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ పరుగులు తీస్తున్నది. దీంతో బుధవారం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.429.32 లక్షల కోట్లకు చేరుకున్నది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల ధోరణులతో బీఎస్ఈ సెన్సెక్స్ కూడా లాభాలతో ముగిసింది. బుధవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 149.98 పాయింట్ల లబ్ధితో 76,606.57 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్లో 593.94 పాయింట్లతో 77,050.53 పాయింట్ల గరిష్టానికి చేరుకున్నది. ఇంతకుముందు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 77,079.04 పాయింట్ల జీవిత కాల గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. దీని కంటే బుధవారం సెన్సెక్స్ 28.51 పాయింట్లు తక్కువగా ముగిసింది. తద్వారా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,29,32,991.65 కోట్లతో తాజా జీవిత కాల గరిష్టానికి చేరుకున్నది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ గత రెండు సెషన్లలో పుంజుకున్నది. పవర్ గ్రిడ్ అత్యధికంగా 2.54 శాతం లబ్ధి పొందితే, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఆల్ట్రా టెక్ సిమెంట్, లార్సెన్ అండ్ టర్బో, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లబ్ధి పొందాయి. మరోవైపు హిందూస్థాన్ యూనీ లివర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టైటాన్ తదితర స్టాక్స్ నష్టాలతో ముగిశాయి.
ఏషియన్ మార్కెట్లు షియోల్, షాంఘై ఇండెక్సులు సానుకూలంగా ముగిస్తే, టోక్యో, హాంకాంగ్ సూచీలు నష్టాలతో ముగిశాయి. ఈయూ దేశాల మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు సైతం మంగళవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 10.7 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.06 శాతం లబ్ధి పొందాయి. ఇండస్ట్రియల్స్, పవర్, క్యాపిటల్ గూడ్స్, ఎనర్జీ, కమోడిటీస్, హెల్త్ కేర్, మెటల్ ఇండెక్సులు భారీగా లబ్ధి పొందగా, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ ఇండెక్సులు నష్టాలతో ముగిశాయి.