వాషింగ్టన్: కృత్రిమ మేథ (Artificial intelligence) తో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)’ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా అభిప్రాయపడ్డారు. కొన్ని రకాల ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందన్నారు. ఇంకోవైపు ఉత్పాదకతను గణనీయంగా పెంచి ప్రపంచవృద్ధికి దోహదం చేసే అవకాశాలనూ ఈ అత్యాధునిక సాంకేతికత తెచ్చిపెడుతుందని ఆమె చెప్పారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగనున్న ‘ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు (World Economic Forum)’ వెళ్లడానికి ముందు ఆదివారం మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టలినా మాట్లాడారు.
అభివృద్ధి దేశాల్లో దాదాపు 60 శాతం ఉద్యోగాలపై ఈ కృత్రిమ మేథ ప్రభావం ఉంటుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం 40 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేశారు. నైపుణ్య ఆధారిత ఉద్యోగాలు అధికంగా ఉన్న రంగాలపై ఈ సాంకేతికత ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. కృత్రిమ మేథతో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేలా పేద దేశాలకు మద్దతివ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అమలు చేసిన ద్రవ్య విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతోందని క్రిస్టలినా తెలిపారు. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు.