Anand Mahindra on Twtter Deal | అనుక్షణం అనుమానాలు.. అణువణువునా సందేహాల మధ్య మూడు నెలల క్రితం మొదలైన మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా వెబ్సైట్ ట్విట్టర్ డీల్‌కు తెర పడింది. స్పామ్ ఖాతాల సాకుతో ట్విట్టర్ కొనుగోలు ఒప్పందానికి టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ రాంరాం చెప్పేశారు. విలీన ఒప్పందంలోని నిబంధనలను ట్విట్టర్ ఉల్లంఘించిందని ఎలన్‌మస్క్ ఆరోపించారు. ట్విట్టర్‌ను కైవసం చేసుకునే విషయమై మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా రియాక్టయ్యారు.. ట్విట్టర్ బోర్డును ఆట పట్టించారని అభివర్ణించారు. ట్విట్టర్లో కొద్దిపాటి వాటా గల వ్యక్తి ఆ సంస్థనే టేకోవర్ చేస్తానంటూ హడావుడి చేశాడని పరోక్ష సెటైర్లు వేశారు.
భారత్‌లోని రైళ్లలో ప్రయాణించినట్లయితే ఎలన్మస్క్పై టికెట్ లేని ప్రయాణికుడని `టీటీ` ముద్ర వేస్తారని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్లు కూడా రియాక్టయ్యారు. `మస్క్‌కు బదులు మీరే కొనుగోలు చేయొచ్చు కదా ట్విట్టర్‌ను` అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. `ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ మనోడే` అని మరో నెటిజన్ రియాక్టయ్యాడు. ఇండియన్ కాబట్టే సరసమైన రేటుకే పరాగ్ అగర్వాల్ ఆఫర్ ఇస్తాడని వ్యాఖ్యానించారు. ఇంకొక నెటిజన్ స్పందిస్తూ.. ఎలన్‌మస్క్ కొనుగోలు చేస్తాడనుకున్నా.. కానీ అలా జరుగలేదు.. కనుక ట్విట్టర్‌కు తన సానుభూతి తెలియజేస్తున్నా అని పేర్కొన్నాడు.
పలు సందేహాల మధ్య సాగిన ఎలన్‌మస్క్-ట్విట్టర్ ఒప్పందం దాదాపు రద్దయినట్లే. ఈ ఒప్పందాన్ని ఆచరణలోకి పెట్టడానికి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ బోర్డు చెబుతున్నది. కానీ ట్విట్టర్ ప్రయత్నాలు ఏ మేరకు విజయవంతం అవుతాయో చూడాల్సిందే. 44 బిలియన్ల డాలర్ల ట్విట్టర్ డీల్.. కోర్టు మెట్లెక్కనున్నట్లు కనిపిస్తున్నది.