Cigarette buts toys | కుక్కపిల్లా.. సబ్బు బిళ్లా.. అగ్గిపుల్లా.. కాదేది కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. ఇదే ఒరవడితో కొబ్బరి పీచు.. చింత గింజ.. మామిడి టెంక.. కాదేది బొమ్మల తయారీకనర్హం అంటున్నారు ఇవ్వాల్టి పారిశ్రామికవేత్తలు. ఒకప్పుడు చెక్కలు, ఇనుప వస్తువులతో బొమ్మలు తయారుచేస్తుండగా.. ప్రస్తుతం పనికిరాని వస్తువులు కూడా అందమైన ఆకృతులుగా ప్రాణం పోసుకుంటున్నాయి. ఇదే కోవలో తాగిపడేసిన సిగరెట్ పీకలతో సాఫ్ట్ టాయ్స్ తయారు చేస్తున్నదో సంస్థ.
ఢిల్లీకి చెందిన వ్యాపారి నమన్ గుప్తా ఆలోచనలకు ప్రతిరూపంగా ఈ సిగరెట్ బట్ సాఫ్ట్ టాయ్స్, పిల్లోస్ తయారవుతున్నాయి. రోడ్లపై తాగి పారేసే సిగరెట్ ముక్కలను ఊడ్చే వ్యక్తుల ద్వారా సేకరిస్తున్నారు. న్యూఢిల్లీ శివారులో ఉన్న వీరి పరిశ్రమలో వాటిని శుభ్రపరిచిన తర్వాత సిగరెట్ పీకల్లో ఉండే దూదిలాంటి ఫైబర్‌ను బయటకు తీసి బ్లీచ్ చేస్తున్నారు. ఈ ఫైబర్‌తో అందమైన బొమ్మలను తయారు చేస్తున్నారు. అలాగే పిల్లోస్ తయారీలో కూడా ఈ ఫైబర్‌ను వాడుతున్నారు.
తొలినాళ్లలో 10 గ్రాముల సిగరెట్ బట్ ఫైబర్ సేకరించేవారం. ఇప్పుడది వేయి కిలోలకు చేరింది. ఇందుకోసం నిత్యం లక్షలాది సిగరెట్ పీకలను సేకరించి రీసైక్లింగ్ చేస్తున్నాం అని సంస్థ అధిపతి నమన్ గుప్తా చెప్పారు. వీరు తయారుచేసిన సాఫ్ట్ టాయ్స్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అమ్మకానికి ఉంచారు. చిన్నారులు వీటిని అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ సంస్థలో పనిచేయడం వల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా జరుగుతున్నదని నమన్ గుప్తా ఉద్యోగి పూనమ్ అభిప్రాయపడ్డారు.