Govinda Legal Notice | బాలీవుడ్ నటుడు గోవింద తన వ్యక్తిగత మరియు కుటుంబ జీవితంపై వస్తున్న తప్పుడు, వార్తలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టిస్తున్న మార్ఫింగ్ కంటెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, తన కుటుంబంపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ ఆయన లీగల్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు మరియు వ్యక్తులు ఎవరైనా తమ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు, ఆడియోలు లేదా డీప్‌ఫేక్ కంటెంట్‌ను ప్రసారం చేస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ తప్పుడు ప్రచారాల వల్ల తన పరువుకు భంగం కలిగిస్తున్నందుకు రూ. 100 కోట్ల వరకు నష్టపరిహారం కోరుతూ సివిల్ మరియు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు నోటీసులో స్పష్టం చేశారు. భారతీయ న్యాయ సంహిత, 2023 మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియా ఖాతాలు మరియు తప్పుడు ప్రచారాలకు పాల్పడేవారిపై బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల క్రయవిక్రయాలు, పాస్‌పోర్ట్‌లపై కూడా ఆంక్షలు కోరే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇటీవల గోవింద సతీమణి సునీత అహుజా బాంద్రా ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన తన డైవర్స్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం, ఆ తర్వాత వారి వివాహ జీవితంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపించడం వంటి పరిణామాల నేపథ్యంలో గోవింద ఈ లీగల్ అడుగు ముందుకు వేశారు. సునీత మరియు గోవిందల మధ్య ఎలాంటి విడాకులు లేవని, వారు కలిసి ఉన్నారని మేనేజర్ స్పష్టం చేసినప్పటికీ, కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన లీగల్ టీమ్ పేర్కొంది.