హైదరాబాద్, డిసెంబర్ 29: అంతర్జాతీయ, దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతుండగా..తాజాగా ఇదే జాబితాలోకి ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ కూడా చేరింది. పాలు, పాలపొడి, వెన్న, ఛీజ్, నెయ్యి, పన్నీర్, చాక్లెట్లు, ఐస్క్రీమ్లు…ఇలా పలు రకాల పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న అమూల్..రాష్ట్రంలో రూ. 500 కోట్లతో ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. దక్షిణాదిలో ఏర్పాటు చేస్తున్న తొలి యూనిట్ ఇదే కావడం విశేషం. రైతుల్ని సంఘటితం చేసి, సహకార ఉద్యమాన్ని పటిష్టపర్చిన అమూల్ దేశంలో క్షీర విప్లవానికి నాంది పలికింది. ఈ బ్రాండ్ పేరుతో పాల ఉత్పత్తుల్ని విక్రయిస్తున్న గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ఏడు దశాబ్దాల క్రితం గుజరాత్లో ఏర్పడింది. ఈ 2021లో అమూల్ 75వ వార్షికోత్సవాలను, సంస్థ వ్యవస్థాపకుడు వర్ఘీస్ కురియన్ శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నది.
మొత్తం ప్లాంట్లు 31
గుజరాత్లో 13, ఢిల్లీ/ఎన్సీఆర్లో 4, ఉత్తరప్రదేశ్లో 2, మహారాష్ట్రలో 4, రాజస్థాన్లో 3, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్, అసోం, చత్తీస్గఢ్, జార్ఖండ్ల్లో ఒక్కొక్కటి చొప్పున ప్లాంట్లు ఉన్నాయి. తాజాగా తెలంగాణలో నెలకొల్పనున్నది 32వ ప్లాంట్.
గ్రూప్ టర్నోవర్ (2021)
రూ.53,000 కోట్లు
జీసీఎంఎంఎఫ్ టర్నోవర్
రూ.39,248 కోట్లు
భాగస్వామ్య పాడి రైతులు
3.6 కోట్ల మంది
రోజూవారీ సేకరించే పాలు:
2.9 కోట్ల లీటర్లు