Sanchar Saathi | కొత్తగా మార్కెట్లోకి తీసుకురానున్న మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ను డిఫాల్ట్‌గా ఉండాలని కేంద్రం ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కేంద్రం తీసుకువచ్చిన సైబర్ సెక్యూరిటీ యాప్ ప్రతిపక్షాలతో పాటు కంపెనీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఉత్తర్వులను టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ఉపసంహరించుకున్నది. యాప్ తప్పనిసరి ఏం కాదని స్పష్టం చేసింది. తాజాగా యాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. సెన్సార్ టవర్ ఇటీవల డేటా ప్రకారం.. సంచార్ సాథీ యాప్‌కు యూజర్ల నుంచి స్పందన లభించింది.
నవంబర్ 29 వరకు భారత్‌లో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన యాప్స్‌ల జాబితాలో 127వ స్థానంలో నిలిచింది. అయితే, డిసెంబర్ 2న కేవలం మూడురోజుల్లోనే గూగుల్, జెమిని, చాట్ ప్రధాన ప్లాట్‌ఫామ్‌లను అధిగమించి ఆపిల్ స్టోర్‌లో నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంది. అయితే, డిసెంబర్ 3న ప్రభుత్వం ప్రీ ఇన్స్టాలేషన్ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడం విశేషం. అయినప్పటికీ యాప్ ఇంకా అగ్రస్థానంలోనే ఉన్నది. సంచార్ సాథీ యాప్‌పై ఒక్కసారిగా ఆసక్తిగా పెరగడానికి ప్రైవసీయే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
గోప్యతా సమస్యలు తలెత్తిన నేపథ్యంలో యాప్స్‌పై యూజర్లలో ఆసక్తిని రేకెత్తించిందని.. దాంతో డౌన్లోడ్స్ సంఖ్యను నేరుగా ప్రభావితం చేసింది. అయితే, కేంద్రానికి అనుకూలంగా కొందరు బీజేపీ మద్దతుదారులే యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లుగా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. డౌన్లోడ్స్ పెరిగేందుకు ఇదే కారణమని పేర్కొంటున్నారు. అయితే, ఇది కేవలం తాత్కాలికమేనని చెబుతున్నారు. అదే సమయంలో గూగుల్ ప్లే స్టోర్‌లోనూ సంచార్ సాథీ యాప్ డౌన్లోడ్స్ గణనీయంగా పెరిగాయి. డిసెంబర్ 1న 15వ స్థానంలో నిలువగా.. 3వ తేదీన రెండో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నది.