న్యూఢిల్లీ, మే 27: ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) అమెరికా మార్కెట్ నుంచి భారతీయ ఔషధ రంగ సంస్థలకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరవచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ సోమవారం అంచనా వేసింది. దేశీయ ఫార్మా కంపెనీలకు అమెరికా విపణి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ ఏర్పడిన ఔషధాల కొరత.. డాక్టర్ రెడ్డీస్, సిప్లా, సన్ ఫార్మా తదితర సంస్థలకు కలిసి రానుందని, వీటి ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయని ఇండియా రేటింగ్స్ అంటున్నది. దీంతో ఈ ఫార్మా సంస్థల రెవిన్యూ వృద్ధి ఈసారీ నిలకడగా కొనసాగగలదన్నది. అమెరికాలో ప్రస్తుతం ఔషధాల కొరత దశాబ్దకాలం గరిష్ఠ స్థాయికి చేరింది. 22 థెరపిటిక్ కేటగిరీల్లో 233 ఔషధాల కొరత ఉన్నదని యూఎస్ఎఫ్డీఏ గణాంకాలు చెప్తున్నాయి.