హైదరాబాద్, ఫిబ్రవరి 7: అమెరికాకు చెందిన ఓ డిజిటల్ ఆడియో సంస్థ.. హైదరాబాద్‌కు చెందిన ఐటీ, డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ కంపెనీ బ్రైట్‌కామ్ గ్రూప్ చేతికి వస్తున్నది. ఈ మేరకు సదరు సంస్థతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ)పై బ్రైట్‌కామ్ గ్రూప్ సంతకాలు చేసింది. డిజిటల్ ఆడియో కంపెనీకి చెందిన అన్ని ఆస్తులను రూ.760 కోట్లకుపైగా (102.5 మిలియన్ డాలర్లు) చెల్లించి బ్రైట్‌కామ్ గ్రూప్ సొంతం చేసుకుంటున్నది. ఒప్పందంలో భాగంగా దాదాపు రూ.710 కోట్ల (95 మిలియన్ డాలర్లు) నగదు, మరో రూ.50 కోట్లకుపైగా (7.5 మిలియన్ డాలర్లు) విలువైన బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లను ఇవ్వనున్నారు. ఈ ఆస్తులన్నీ సతీశ్ చీతి నేతృత్వంలోని బ్రైట్‌కామ్ ఆడియో కొత్త విభాగం కింద ఉండే బ్రైట్‌కామ్ గ్రూప్ అమెరికా సంస్థలో భాగం కానున్నాయి. కాగా, ఇంటిగ్రేటెడ్ డిజిటల్ వేదికైన ఈ అమెరికా సంస్థ.. రేడియో స్టేషన్లకు పలు కార్యక్రమాలను చేస్తుండటమేగాక, అగ్రరాజ్యంలోని చాలా ప్రాంతాల్లో డిజిటల్ బ్రాండ్లను, డిజిటల్ మార్కెటింగ్ సేవలను కూడా అందిస్తున్నది. అమెరికాలో డిజిటల్ ఆడియో క్రియాశీల కన్జ్యూమర్లు ఇప్పటికే 200 మిలియన్లున్నారు. ఇక్కడ ఆడియో అనేది అత్యంత ఆదరణ ఉన్న డిజిటల్ యాక్టివిటీ. ప్రపంచవ్యాప్తంగా కూడా డిజిటల్ ఆడియో యూజర్లు పెరుగుతుండగా, 2026 నాటికి 1.5 బిలియన్లను దాటవచ్చని అంచనా. ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆడియో ప్రకటనల విభాగంలోకి ఈ డీల్‌తో బ్రైట్‌కామ్ గ్రూప్ ఘనంగా ప్రవేశించబోతున్నది. అమెరికా డిజిటల్ ఆడియో సంస్థ కొనుగోలు వ్యూహాత్మకంగా మా సంస్థకు బాగా కలిసొస్తుందన్న విశ్వాసం మాకున్నది’.
-సురేశ్ రెడ్డి, బ్రైట్‌కామ్ సీఎండీ
‘డిస్ప్లే, మొబైల్, వీడియోల నుంచి మా సేవల విస్తరణకు ఈ డీల్ ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ కొనుగోలుతో అంతర్జాతీయంగా ఆడియోసహా సంపూర్ణ, విస్తృత శ్రేణి అడ్వైర్టెజింగ్ సొల్యూషన్స్‌ను అందిస్తున్న అతికొద్ది సంస్థల్లో బ్రైట్‌కామ్ గ్రూప్ కూడా చేరుతుంది’
-పెశ్వ ఆచార్య, బ్రైట్‌కామ్ గ్రూప్ వ్యూహాత్మక విభాగం అధ్యక్షుడు