Amazon Record | ఫేస్బుక్ యాజమాన్యం మెటా ప్లాట్‌ఫామ్స్ స్టాక్స్ భారీగా పతనమైన మరునాడే.. మరో రికార్డు నమోదైంది. గ్లోబల్ ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ కేవలం ఒక్కరోజులో ఆ రికార్డు నమోదు చేసింది. శనివారం ట్రేడింగ్‌లో అమెజాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 190 బిలియన్ల డాలర్లు పెరిగింది. మన కరెన్సీలో రూ.14,18,200 కోట్లు. ఆన్లైన్ రిటైల్ కం క్లౌడ్ కంప్యూటింగ్ జెయింట్ అమెజాన్ షేర్లు శనివారం 13.5 శాతం లబ్ధి పొందాయి. రికార్డు స్థాయిలో త్రైమాసిక లాభాలు గడించినట్లు ప్రకటించడంలో అమెజాన్ ఎం-క్యాప్ భారీగా పెరిగింది. దీంతో అమెజాన్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.6 లక్షల డాలర్ల (రూ.1,41,82060 కోట్లు)కు చేరుకున్నది. గురువారం ప్రకటించిన లాభాలు అంచనాలను అధిగమించడంతో అమెజాన్ షేర్లు దూసుకెళ్లాయి. అమెరికాలో అమెజాన్ వార్షిక సబ్స్క్రిప్షన్ రేటు 17 శాతం పెంచినట్లు ప్రకటించింది.
టెక్ జెయింట్ ఆపిల్ రికార్డును కూడా అమెజాన్ బ్రేక్ చేసింది. గత నెల 28న ఆపిల్ బ్లాక్‌బస్టర్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. దీంతో ఆ రోజు ఆపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 181 బిలియన్ల డాలర్లు (రూ.13.51 లక్షల కోట్లు) పెంచుకున్నది. శనివారం మెటా ప్లాట్‌ఫామ్స్ స్క్రిప్ట్ 0.3 శాతం పతనమైంది. దీంతో మెటా ఎం-క్యాప్ 660 బిలియన్ల డాలర్లు (సుమారు రూ.49,26,400 కోట్లు) వద్ద నిలిచింది. మెటా ప్లాట్‌ఫామ్ ఎం-క్యాప్ 200 బిలియన్ల డాలర్లకు పైగా (సుమారు రూ.14,92,800 కోట్లు) పతనమైంది. సోషల్ మీడియా జెయింట్ ఫేస్బుక్ పేరెంట్ సంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ స్క్రిప్ట్ ఒక్కరోజులో అత్యధికంగా పతనం కావడం ఇదే తొలిసారి.
ఏటీ అండ్ టీ, మోర్గాన్ స్టాన్లీ, నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అమెజాన్ ఎం-క్యాప్ దాటేసింది. ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఓనర్ అల్ఫాబెట్ ఇప్పటికీ వాల్‌స్ట్రీట్ మోస్ట్ వాల్యూబుల్ కంపెనీలుగా నిలిచాయి. ఆపిల్ ఎం-క్యాప్ 2.8 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.2,09,00000 కోట్లు), మైక్రోసాఫ్ట్ ఎం-క్యాప్ 2.3 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ. 1,71,67800 కోట్లు), అల్ఫాబెట్ 1.9 లక్షల కోట్ల డాలర్లు (రూ. 1,41,82100 కోట్లు)గా నిలిచింది.