అమెజాన్ ఎయిర్ వల్ల సుమారు 11 లక్షల మంది విక్రయదారులకు మేలు చేకూరుతుంది. డెలివరీ నెట్‌వర్క్‌ను మరింత పటిష్ఠం చేసేందుకు మరిన్ని పెట్టుబడులు పెడతాం. 2016లో అమెరికాలో అమెజాన్ ఎయిర్ సేవలు ప్రారంభమవగా..ఆ తర్వాత బ్రిటన్‌కు విస్తరించాం. అమెరికా, యూకే తర్వాత ఈ సేవలను తెలంగాణలో ప్రైమ్ ఎయిర్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చాం.
-అమెజాన్ ప్రతినిధి అఖిల్ సక్సేనా
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23(నమస్తే తెలంగాణ): ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్..భారత్‌లో తన తొలి కార్గో విమాన సేవలు ప్రారంభించింది. దేశంలో తన రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చుకోవడంతోపాటు కస్టమర్లకు మరింత వేగవంతంగా వస్తువులను అందజేయాలనే ఉద్దేశంతో అమెజాన్ ఎయిర్ పేరుతో ఏర్పాటైన ఈ సేవలను హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రారంభించిన అమెజాన్ ఎయిర్ సేవలతో దేశీయ విమానయానం, ఈ-కామర్స్ సంస్థలకు దన్నుగా నిలువనున్నదని పేర్కొన్నారు. ఈ కార్గో సేవలు ఉత్తర అమెరికా, యూరప్ వెలుపల ప్రారంభించేందుకు తెలంగాణను ఎంచుకోవడం శుభసూచికమన్న మంత్రి.. దేశీయ కస్టమర్లకు మరింత వేగవంతంగా వస్తువులు డెలివరీ చేయడానికి అమెజాన్‌కు ఉపయోగపడనున్నదన్నారు. ఏరోస్పేస్ రంగంలో రాష్ట్రం ఎన్నో విజయాలు సాధించిందని, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఏరోస్పేస్ ఉత్తమర రాష్ట్ర అవార్డును గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.
కార్గో ట్రాఫిక్ 35 శాతం వృద్ధి
రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల చర్యల వల్ల తెలంగాణలో ఏవియేషన్, ఏరోస్పేస్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి పేర్కొన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని, 2028 నాటికి ఈ సంఖ్య 4 కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నదన్నారు. అలాగే 2020-21లో ఎయిర్ కార్గో ట్రాఫిక్ సైతం 35 శాతం వృద్ధిని సాధించిందని మంత్రి పేర్కొన్నారు. అమెజాన్ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. 2014లో రూ.1.24 లక్షలుగా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం ప్రస్తుతం రెండింతలు పెరిగి రూ.2.78 లక్షలకు చేరుకున్నదని, భారతదేశ ఆవిషరణ సూచికలో రాష్ట్రం రెండో స్థానంలో ఉన్నదని వ్యాఖ్యానించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) ర్యాంకింగ్స్‌లో దేశంలోని మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నదన్నారు.
ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో వస్తువులను త్వరితగతిన డెలివరీ చేయడానికి అమెజాన్.. బోయింగ్ 737-800 విమానాన్ని వినియోగించుకుంటున్నది. ఇందుకోసం బెంగళూరుకు చెందిన క్విక్జెట్తో జతకట్టింది.
‘విమానాశ్రయం నుంచి మరో కార్గో సర్వీసు చేరడం సంతోషంగా ఉన్నది. హైదరాబాద్ నుంచి దక్షిణాదిలో కార్గో సేవలు పెంచడానికి క్విక్‌జెట్ సేవలు ఉపయోగపడనున్నాయి. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా నిరాటంకమైన, వేగవంతమైన కార్గో సేవలను అందించడానికి ప్రపంచ స్థాయి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం’
– ప్రదీప్ పణిక్కర్, జీహెచ్ఐఏఎల్ సీఈవో
‘హైదరాబాద్‌తో అమెజాన్ లవ్‌స్టోరీ’
ప్రపంచంలో అతిపెద్ద క్యాంపస్ ఇక్కడే ఏర్పాటు
ఆసియాలో అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను కూడా ఇక్కడే ఏర్పాటు చేసింది.
4.4 బిలియన్ డాలర్లు (రూ.36 వేల కోట్లు)తో అమెజాన్ వెబ్ సర్వీసెట్ డాటా సెంటర్లు కూడా..
అమెజాన్ ఎయిర్ సేవలు అమెరికా, యూరప్ తర్వాత తాజాగా ఇక్కడే