న్యూఢిల్లీ, అక్టోబర్ 24: వెటరన్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ అజయ్ గోయెల్ తిరిగి సొంతగూటికి చేరారు. గతంలో వేదాంతను వీడి బైజూస్‌లో చేరిన ఆయన..తిరిగి వేదాంత నూతన చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎఫ్‌వోగా విధులు నిర్వహిస్తున్న సోనల్ శ్రీవాత్సవ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో గోయెల్ నియమితులయ్యారు. ఈ నియామకం ఈ నెల 30 నుంచి అమల్లోకి రానున్నట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. వేదాంత పునర్వ్యవస్తీకరణలో భాగంగా సీనియర్ ఉన్నతాధికారులు తిరిగి చేరుతున్నారని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మొదట్లో వేదాంతను వీడిన ఆయన బైజూస్‌లో చేరారు. అక్టోబర్ 23, 2021 నుంచి ఏప్రిల్ 9, 2023 వరకు వేదాంత యాక్టింగ్ సీఎఫ్‌వోగా పనిచేశారు.