హైదరాబాద్, జనవరి 29 : దేశీయంగా కమర్షియల్ విమానాలకు ఎనలేని డిమాండ్ నెలకొంటున్నది. వచ్చే పదేండ్లకాలంలో 100 సీటింగ్ కెపాసిటీ కలిగిన విమాన సర్వీసులు మూడింతలు పెరిగి 2,250కి చేరుకోనున్నదని ఎయిర్‌బస్ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 850 ఫ్లైట్ సర్వీసులు నడుస్తున్నాయని, 2035 నాటికి ఇవి 2,250 చేరుకోనున్నట్లు ఎయిర్‌బస్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్, ఎండీ జర్గెన్ వెస్ట్ర్మియర్ తెలిపారు. అలాగే దేశీయంగా తయారైన ఎయిర్‌బస్ సీ-295, ట్విన్-ఇంజిన్ మీడియం మిలటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి డెలివరీ చేయనున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా 1,250 విమానాలు నడుస్తున్నాయని, వారానికి రెండు చొప్పున ప్రతియేటా 120-150 విమానాలను డెలివరీ చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు, వచ్చే పదేండ్లకాలంలో ప్రయాణికుల్లో వృద్ధి 8.9 శాతం నమోదుకానున్నదని అంచనావేసిన ఆయన.. ఇందుకోసం విమానయాన రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ విమాన విడిభాగాల తయారీ సంస్థ ఫ్లేమింగ్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్..యూనైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్(యూఏసీ)తో జట్టుకట్టింది. ఆరు 68 సీటింగ్ ఐఎల్-114-300 ఎయిర్‌క్రాఫ్ట్ డెలివరీ చేయనున్నది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, సీఈవో శుభాకర్ పప్పుల మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చిన్న స్థాయి విమాన సర్వీసులకు పెరుగనున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రష్యాకు చెందిన యూఏసీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు, రెండేండ్లకాలంలో ఈ చిన్న స్థాయి విమానాలను అవసరమైన సంస్థలకు డెలివరీ చేయనున్నట్టు చెప్పారు. అలాగే దక్షిణాదిలో విమానాల తయారీకోసం అసెంబ్లింగ్ యూనిట్‌ను నెలకొల్పే అవకాశం ఉందన్నారు. 1.5-2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ అసెంబ్లింగ్ యూనిట్ 2032 తర్వాత అందుబాటులోకి రానున్నదన్నారు. ఎక్కడ ఏర్పాటు చేసేదానిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినప్పటికీ హైదరాబాద్‌కు ప్రాధాన్యతనివ్వనున్నట్టు సూచనప్రాయంగా ఆయన చెప్పారు.