న్యూఢిల్లీ, మార్చి 8: ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. రోజుకొక రికార్డు సృష్టిస్తూ పెరగడంతో సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కరోనాతో కుదేలైన జీవన ప్రమాణాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతుండగా..తాజాగా సామాన్యుడిపై ఇంధన బాంబు పిడుగురూపంలో పడింది. ఒకవైపు పెట్రో ధరలు ఈవారంలోనే లీటర్‌పై రూ.15 వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతోపాటు విమానాల్లో వాడే ఇంధన ధరలు మరోసారి భగ్గుమనబోతున్నాయి. గత మూడు నెలలుగా వరుసగా ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలు..ఈసారి మాత్రం తమ టిక్కెట్టు ధరలను పెంచడానికి సిద్ధమవతున్నాయి. ఈ నెలలో విమాన టిక్కెట్టు ధరలు 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరగబోతున్నాయి.
విమానయాన మంత్రిత్వ శాఖ వద్దకు
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో విమాన టిక్కెట్ ధరలు పెంచాలని విమానయాన మంత్రిత్వ శాఖను కోరుతున్నాయి విమానయాన సంస్థలు. గడిచిన రెండు నెలలుగా విమాన జెట్ ఫ్యూయల్ భారీగా పుంజుకుంటున్నది. డిసెంబర్ 15 నుంచి ఇప్పటి వరకు జెట్ ఫ్యూయల్ కిలో లీటర్ ధర 26.4 శాతం లేదా రూ.19,508 అధికమైంది. ఈ నెల 1న ఇంధన ధరలు 3.22 శాతం అధికమవడంతో కిలో లీటర్ ధర ఢిల్లీలో రూ.93,530.66కి చేరుకున్నది. దీంతో ఈ నెలలోనే మెట్రో నగరాల మధ్య నడిచే విమాన టిక్కెట్ల ధరలు 15-20 శాతం మధ్యలో పెరగనుండగా..అదే ప్రాంతీయ రూట్లలో మధ్య టిక్కెట్ ధరలు 20-25 శాతం వరకు అధికమవనున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఢిల్లీ-ముంబైల మధ్య ప్రస్తుతం రూ.2,300-13 వేల మధ్యలో ఉండగా..ఈ నెల చివరినాటికి ఈ ధర రూ.2,900 నుంచి రూ.15 వేల వరకు చేరుకోనున్నాయి. విమాన నిర్వహణలో ప్రధాన వ్యయం ఇంధన కోసం ఖర్చు పెడుతుండటంతో సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 2021-22లో దేశీయ విమానయాన సంస్థలకు రూ.25-26 వేల కోట్ల నష్టం రావచ్చునని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది.