హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేథస్సు (ఏఐ) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏఐ ఏడాదిలోనే సాఫ్ట్వేర్ కోడ్‌లన్నింటినీ రాసేస్తుందని ఇప్పటికే పలువురు టెక్నాలజీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనుషులు అందిస్తున్న కొన్ని సేవలను ‘ఏఐ ఏజెంట్లు’గా పిలిచే యంత్రాలే చేయనున్నాయి మరి. ఇక ఆయా యాప్‌లను ఏఐ ఏజెంట్లు అభివృద్ధి చేయనున్నట్టు తాజాగా ‘గ్లోబల్ సీఆర్ఎం లీడర్ సేల్స్ ఫోర్స్’ తన నివేదికలో తెలిపింది.
ఏఐతో ఉద్యోగ నియామకాల్లో సైతం భారీ మార్పులు వస్తాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్న నేపథ్యంలో దేశంలోని ప్రతీ 10మంది సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసే లీడర్లలో 9మంది యాప్‌లను అభివృద్ధి చేసేందుకు సంప్రదాయ సాఫ్ట్వేర్ టూల్స్‌గా ఏఐ ఏజెంట్లు అవసరమని భావిస్తున్నట్టు రిపోర్టు వెల్లడించింది. దేశంలోని సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేసే లీడర్లు.. ఏఐ ఏజెంట్లను వేగంగా నియమించుకుంటున్నట్టు రిపోర్టు వెల్లడించింది. రానున్న అభివృద్ధి యుగంలో ఏఐ యంత్రాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపింది.
మన దేశంలోని 100మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2 వేలమంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లీడర్లు ఏజెంటిక్ ఏఐపై ఒకేలా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు ఈ నివేదిక వెల్లడించింది. సాఫ్ట్వేర్ల అభివృద్ధి భవిష్యత్తును రూపొందించడంలో ఏఐ సాధనాలు, ఏజెంట్ల ప్రాముఖ్యత పెరుగుతుండటం.. ఏఐ ఆధారిత అభివృద్ధివైపు స్పష్టమైన మార్పును సూచిస్తున్నట్టు అధ్యయనం తెలిపింది. భారత్‌లోని సాఫ్ట్వేర్ అభివృద్ధి లీడర్ల అభిప్రాయం ప్రకారం.. రానున్న రెండేండ్లలో 100 శాతం ఆయా కంపెనీల్లోని టీమ్‌లు కోడ్ జనరేషన్‌కు ఏఐని వినియోగించుకుంటాయని రిపోర్టు తెలిపింది. 91 శాతం కంపెనీల్లోని టీమ్‌లు ఏఐ ఏజెంట్లను నియమించుకుంటాయని వెల్లడించింది.
ఏఐ ఏజెంట్లను నియమించుకునేందుకు ఆధునిక మౌలిక వసతులు, నైపుణ్యాలు, సామర్థ్యాలను పరీక్షించడం మరింత సవాలుగా మారనుందని 85 శాతం సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసే లీడర్లు అభిప్రాయపడినట్టు రిపోర్టు తెలిపింది. అయితే ఇందులో 40 శాతం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లీడర్లు తమ వద్ద ఏఐ ఏజెంట్లను నియమించుకోవడానికి పరీక్ష సామర్థ్య ప్రక్రియ పూర్తిగా లేదని అభిప్రాయపడినట్టు రిపోర్టు వెల్లడించింది.
మనిషి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా, స్వతంత్రంగా నిర్దిష్ట పనులను పూర్తి చేసేందుకు ఉపయోగపడే ఏఐ సిస్టమ్‌లను ‘అటానమస్ ఏజెంట్లు’గా వ్యవహరిస్తారు. వివిధ పనులు, ప్రక్రియలను ఆటోమేట్ చేసేందుకు వీటిని వినియోగించుకునే విధానాన్ని ఏజెంటిక్ ఏఐగా పరిగణిస్తారు. అయితే డెవలపర్లు కోడ్ రాయడం, డీబగ్గింగ్ వంటి సాధారణ పనుల నుంచి మరింత వ్యూహాత్మకంగా, ప్రభావవంతంగా ‘ఏజెంటిక్ ఏఐ’ చొరవ చూపనున్నట్టు రిపోర్టు చెప్పింది. డెవలపర్లు లో-కోడ్, నో-కోడ్ సాధనాలతో నడిచే ఏజెంట్లను ఎక్కువగా ఉపయోగిస్తుండగా.. డెవలపర్ల కోడింగ్ సామర్థ్యాలతో సంబంధం లేకుండా.. అభివృద్ధి వేగంగా, సులభంగా, సమర్థవంతంగా మారనుంది.
‘భారత్‌లో 92 శాతం మంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లీడర్లు ఏజెంటిక్ ఏఐ తప్పనిసరి అని చెప్పడంతో రానున్న రోజుల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ‘భవిష్యత్తులో డెవలపర్లను కేవలం కోడర్లుగా చూడొద్దు అనే దిశగా మనం ముందుకు సాగుతున్నాం. తెలివైన వ్యవస్థలను ఏర్పరిచే ఏజెంట్ ఆధారిత ఆర్కిటెక్చర్లకు ఆవిష్కరణలు చేసేందుకు అనుమతి ఇవ్వాలి.’ అని సేల్స్‌ఫోర్స్-సౌత్ ఆసియా ఈవీపీ అండ్ ఎండీ అరుణ్ పరమేశ్వరన్ తెలిపారు.