ముంబై, నవంబర్ 17: దేశీయ ఫారెక్స్ నిల్వలు మళ్లీ క్షీణించాయి. ఈ నెల 10తో ముగిసిన వారంలో రూ.462 మిలియన్ డాలర్లు పడిపోయి 590.321 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం తెలియజేసింది. అంతకుముందు రెండు వారాల్లో 7.251 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు వారాల్లో మాత్రం వరుసగా ఫారెక్స్ నిల్వలు ఆందోళనకరంగా పతనం కావడం గమనార్హం.
ఏకంగా 15-20 బిలియన్ డాలర్ల మేర హరించుకుపోయాయి. 2021 అక్టోబర్లో భారతీయ ఫారెక్స్ రిజర్వులు మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 645 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే మళ్లీ ఎప్పుడూ ఆ స్థాయికి దేశంలో విదేశీ మారకం నిల్వలు చేరకపోవడం గమనించదగ్గ అంశం. ఇదిలావుంటే ప్రస్తుతం భారత్ వద్ద ఫారిన్ కరెన్సీ అసెట్స్ 522.004 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దేశీయ ఫారెక్స్ నిల్వల్లో ఇవే అత్యధికం. ఇక బంగారం నిల్వల విలువ 45.515 బిలియన్ డాలర్లుగా ఉన్నది.