LinkedIn | పాఠశాల విద్య పూర్తి చేసుకున్న ఓ కుర్రాడు కంపెనీకి సీఈఓ కావడమే కాదు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగినా వింత అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన వయస్సు 15 ఏండ్లు మాత్రమే కావడంతో ఆ కుర్రాడిపై పేరొందిన జాబ్ సెర్చ్ వెబ్ సైట్ లింక్డ్ఇన్ (LinkedIn) నిషేధం విధించింది.
ఆ కుర్రాడి పేరు ఎరిక్ జూ.. పాఠశాల విద్య పూర్తి కాగానే ఏవియాటో సంస్థ ఏర్పాటు చేశాడు. వెంచర్ ఫండ్స్ కోసం డెవలప్ చేసిన స్టార్టప్ సెర్చింజన్ ఇది. ప్రస్తుతం ఈ సంస్థ సీఈఓగానూ, బచ్ మ్యానిటీ కేపిటల్ సంస్థలో ఇన్వెస్టర్ గానూ ఉన్నాడు. ఆయన సంస్థ ఏవియాటోలో అతడి కంటే పెద్దవారు పని చేస్తున్నా.. లింక్డ్ ఇన్ మాత్రం ఎరిక్ జూపై బ్యాన్ విధించింది.
అసలు సంగతేమిటంటే లింక్డ్ ఇన్లో చేరడానికి కనీస వయస్సు అర్హత 16 ఏండ్లు ఉండటమే. ఈ విషయమై లింక్డ్ ఇన్ నిబంధనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో స్పేస్ ఎక్స్ లో పని చేసిన 14 ఏండ్ల కైరన్ క్వాజీకి ఇదే పరిస్థితి ఎదురైంది.
‘కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిలో కొందరు ఉద్యోగులు నాకు మెసేజ్ చేస్తున్నారు. `నన్నెందుకు లింక్డ్ ఇన్ లో బ్లాక్ చేశారని అడుగుతున్నారు. నా వయస్సు 15 ఏండ్లే కావడంతో నన్ను లింక్డ్ ఇన్ బ్లాక్ చేసింది. అందుకే మీరు నన్ను ట్యాగ్ చేయలేకపోతున్నారు` అని ఎరిక్ జూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు సంగతి బయట పడింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. లింక్డ్ ఇన్ నిబంధనలు మార్చాలని సూచిస్తున్నారు.