న్యూఢిల్లీ, మే 26: వరుసగా రెండు వారాలపాటు పెరుగుతూ వచ్చిన విదేశీ మారక నిల్వలు మే 19తో ముగిసిన వారంలో భారీగా తగ్గాయి. ఈ సమీక్షా వారంలో 6.052 బిలియన్ డాలర్ల మేర తగ్గి, 593.477 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్టు శుక్రవారం రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. అంతక్రితం వారంలో ఇవి 3.5 బిలియన్ల వరకూ పెరిగి 600 బిలియన్ మార్క్ సమీపానికి చేరిన తర్వాత అనూహ్యంగా పడిపోయాయి. విదేశీ మారక నిల్వల్లో అధికభాగమైన కరెన్సీ ఆస్తులు మే 19తో ముగిసిన వారంలో 4.654 బిలియన్ డాలర్ల మేర తగ్గి, 524.945 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. నాన్-అమెరికా కరెన్సీలు యూరో, పౌండ్, యెన్ విలువల తగ్గుదల లేదా పెరుగుదల కూడా కరెన్సీ ఆస్తుల నిల్వలను ప్రభావితం చేస్తుంది. సమీక్షా వారంలో బంగారం నిల్వలు 1.227 బిలియన్ డాలర్ల వరకూ తగ్గి 45.127 డాలర్ల వద్దకు పడిపోయాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 137 మిలియన్ల మేర తగ్గడంతో ఈ నిల్వలు 18,276 బిలియన్ డాలర్లకు చేరాయి. అలాగే ఐఎంఎఫ్ వద్దనున్న భారత్ నిల్వలు 35 మిలియన్లు తగ్గుదలతో 5.13 బిలియన్ డాలర్ల స్థాయికి దిగివచ్చాయి.
2021 అక్టోబర్‌లో దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు 645 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయికి చేరుకున్న తర్వాత క్రమేపీ తగ్గుతూ ఒక దశలో 500 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోయాయి. రూపాయి నిలువునా పతనమైన నేపథ్యంలో క్షీణతను నిలువరించడానికి రిజర్వ్‌బ్యాంక్ అమెరికా డాలర్లను ఖర్చుచేయడం, చమురు ధరలు భారీగా పెరగడంతో దిగుమతులకు విదేశీ కరెన్సీని వ్యయపర్చాల్సిరావడంతో మారక నిల్వలు ఆవిరైపోయాయి. దాదాపు రెండేండ్లు గడుస్తున్నా, మళ్లీ అప్పటి రికార్డుస్థాయికి చేరుకోలేకపోతున్నాయి.