Adani | న్యూయార్క్, నవంబర్ 23: లంచం, నేరారోపణల కేసులో అమెరికా దూకుడును ప్రదర్శిస్తున్నది. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతోపాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికా స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్.. సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) సమన్లు పంపింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు సాగర్ అదానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న విషయం తెలిసిందే. కాగా, దేశంలో సోలార్ పవర్ కాంట్రాక్టులను పొందడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికార వర్గాలకు రూ.2,200 కోట్లకుపైగా లంచాలు ఇచ్చారని ఎస్ఈసీ ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఈ వ్యవహారంలో అమెరికా న్యాయ శాఖ, ఎఫ్‌బీఐ దర్యాప్తులూ జరుగుతుండగా.. అదానీసహా మొత్తం 8 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పటికే గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై అమెరికాలో అరెస్ట్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలపై వివరణ కోరుతూ ఎస్ఈసీ ఈ సమన్లు జారీ చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోగల అదానీల నివాసాలకు వీటిని పంపింది. ఈ సమన్లు అందుకున్న 21 రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ గురువారం న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారా జారీ అయిన నోటీసుల్లో పేర్కొన్నది. స్పందించకపోతే కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి ఉంటుందని, తదుపరి చర్యలకు బాధ్యులు అవుతారని కూడా ఎస్ఈసీ హెచ్చరించింది.
ఇదీ సంగతి..
ఇన్వెస్టర్లను మోసం చేసి నిధుల సమీకరణకు అదానీ పాల్పడ్డారని ఎఫ్బీఐతోపాటు అమెరికా ప్రాసిక్యూటర్లు, రెగ్యులేటర్లు చెప్తున్నారు. ఈ కేసులో ప్రధానంగా రెండు ఆరోపణలున్నాయి. అందులో మొదటిది తప్పుడు ప్రకటనలతో భారత్‌లో సోలార్ పవర్ కాంట్రాక్టులను అడ్డుపెట్టుకొని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అమెరికా మదుపరుల నుంచి 2 బిలియన్ డాలర్లకుపైగా రుణాల సమీకరణకు దిగారు. ఇక రెండోది అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను భాగస్వామ్యం చేస్తూ 1 బిలియన్ డాలర్లకుపైగా విలువైన బాండ్లను జారీ చేశారు. వీటిని అమెరికా తదితర మార్కెట్లలో ప్రవేశపెట్టి, అక్కడి మదుపరులకు అమ్మారు. అందుకే అమెరికా ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నది. కాగా, 2022లోనే ఈ కేసులో దర్యాప్తు మొదలైందని, అయితే అడ్డంకులు సృష్టించారని అక్కడి ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. అయితే ఈ కేసును అదానీ గ్రూప్ ఖండిస్తున్నది. తాము ఏ తప్పూ చేయలేదని, అధికార ప్రతినిధులు ప్రకటిస్తున్నారు.
మా కంపెనీలు భద్రమే: గ్రూప్ సీఎఫ్‌వో
అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీపై లంచం కేసు నేపథ్యంలో గ్రూప్‌నకు చెందిన 11 సంస్థలపై ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని, కాబట్టి సంస్థలకు ఏ రకమైన న్యాయపరమైన చిక్కులు లేవని అదానీ గ్రూప్ సీఎఫ్‌వో జుగెషీందర్ రోబీ సింగ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో స్పందించారు. కాగా, ఈ కేసు గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయని, మేము ఈ అంశంలో పూర్తి వివరణ ఇచ్చేదాకా ఎలాంటి ఊహాగానాలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలతోపాటు అదానీ గ్రీన్ ఎనర్జీ ఎండీ వినీత్ జైన్, అజుర్ పవర్ గ్లోబల్ మాజీ సీఈవో రంజిత్ గుప్తా, దాని మాజీ ఉద్యోగి రూపేశ్ అగర్వాల్, సీడీపీక్యూ మాజీ ఉద్యోగులు సిరిల్ క్యాబెన్స్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రాలు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.