న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రమోటర్లకు చెప్పాపెట్టకుండా న్యూస్ చానల్ ఎన్డీటీవీలో ఇప్పటికే 29 శాతం వాటాను బలవంతంగా స్వాధీనం చేసుకున్న అదానీ గ్రూప్ మరో 26 శాతం వాటా కొనుగోలుకు జారీచేస్తున్న ఓపెన్ ఆఫర్ను పబ్లిక్ ఇన్వెస్టర్లు తిరస్కరించవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. షేరుకు రూ.294 ధరతో ఇన్వెస్టర్ల నుంచి 1,67,62,530 ఈక్విటీ షేర్ల కొనుగోలుకు అదానీ ఓపెన్ ఆఫర్ ప్రకటించగా, బుధవారం ఎన్డీటీవీ షేరు రూ.388 వద్ద ముగిసింది. మార్కెట్ ధరకంటే 25 శాతం తక్కువకు ఓపెన్ ఆఫర్ ఉన్నందున, దానికి ఇన్వెస్టర్లు బిడ్ చేయరని విశ్లేషకులు అంటున్నారు. రూ.493 కోట్ల విలువైన ఈ ఆఫర్ విజయవంతమైతే ఎన్డీటీవీలో అదానీ వాటా 55 శాతానికి చేరుతుంది. ఆఫర్ ధరను పెంచితేనే షేర్లను ఇన్వెస్టర్లు టెండర్ చేస్తారని స్టేక్హోల్డర్స్ ఎంపవర్మెంట్ సర్వీసెస్ ఎండీ జేఎన్ గుప్తా చెప్పారు.
ఎన్డీటీవీ ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ రుణం పొందినపుడు వీసీపీఎల్కు 2009-2010లో జారీచేసిన కన్వర్ట్బుల్ వారెంట్లపై ఇరు సంస్థలూ చేసుకున్న ఒప్పందంలోని నిబంధనలు ప్రస్తుతం కీలకం కానున్నాయని లీగల్ నిపుణులు చెప్పారు. వారెంట్లను ఈక్విటీ మార్చుకోవడం ద్వారానే ఎన్డీటీవీలో 29 శాతం వాటాను అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. రుణం చెల్లించకపోతే వారెంట్లను ఈక్విటీగా మార్చుకునే హక్కు వీసీపీఎల్కు ఉంటుందని, అయితే ఎన్డీటీవీ ప్రమోటర్లు తమకు ఏమీ తెలియకుండానే ఈ మార్పిడి జరిగిందంటూ ఆరోపించినందున ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ఏమిటో తెలియాల్సి ఉందని ఇండస్లా పార్టనర్ రవికుమార్ చెప్పారు.
వారెంట్ల మార్పిడిని తెలియపర్చాలన్న క్లాజ్ ఒప్పందంలో ఉంటే ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ లీగల్ చర్యల్ని చేపట్టవచ్చని ఆయన సూచించారు. రుణ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం వారెంట్ల మార్పిడి జరగలేదంటూ వారు కోర్టుల్లో వాదించవచ్చన్నారు. అలాగే వారెంట్ల మార్పిడికి కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు అనుమతిని కూడా పొందాల్సి వస్తుందని ఆయన చెప్పారు. వారెంట్లను ఈక్విటీ షేర్లుగా మార్చుకున్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించడం చట్ట పరిధిలోనే జరిగినప్పటికీ, దీనిని ఎన్డీటీవీ ప్రమోటర్లు సవాలు చేస్తే సుదీర్ఘమైన చట్ట పోరాటానికి దారితీస్తుందని స్పైస్ రౌట్ లీగల్ పార్టనర్ ప్రవీణ్ రాజు అభిప్రాయపడ్డారు.