Home Loans | ఆర్బీఐ తాజాగా మరో 25 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచేసింది. దీంతో ఆర్బీఐ రెపోరేట్ 6.25 నుంచి 6.50 శాతానికి చేరుకుంది. తత్ఫలితంగా ఇంటి రుణం మొదలు ఆటో, పర్సనల్ రుణాలు మరింత కాస్ట్లీ అయ్యాయి. అంటే ఇప్పటికే ఆయా రుణాలు తీసుకున్న వారి నెలవారీ వాయిదాలు (ఈఎంఐ) పేమెంట్స్ పెరుగుతాయి. 2018 ఆగస్ట్ ఒకటో తేదీ తర్వాత ఆర్బీఐ రెపోరేట్ అత్యధిక స్థాయి 6.50 శాతానికి చేరుకున్నది. 2018లో రెపోరేట్ 6.50 శాతమే. తాజాగా ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగా దేశీయ బ్యాంకులన్నీ ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు సవరించేస్తాయి. గతేడాది మే నెలకు ముందు ఇంటి రుణం తీసుకున్నార అనుకుందాం.. తాజా వడ్డీరేటు పెంపుతో అదనంగా ప్రతి నెలా రూ.2,988 ఈఎంఐ చెల్లించాలి.
ఈ నెల ఒకటో తేదీన వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంట్‌కు సమర్పించిన తర్వాత ఇది తొలి ద్రవ్య పరపతి సమీక్ష. ఇంతకుముందు డిసెంబర్ సమీక్షలో ఆర్బీఐ రెపోరేట్ 5.90 నుంచి 6.25 శాతానికి పెంచేశారు. గతేడాది మే నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ రెపోరేట్ ఆరుసార్లలో 2.50 శాతం పెంచేసింది. 2020 మే 22 తర్వాత తిరిగి గతేడాది మే నెలలో రెపోరేట్ పెంపు మొదలైంది.
ఉదాహరణకు సత్య ప్రకాశ్ అనే వ్యక్తి 7.90 శాతం వడ్డీ (ఫిక్స్డ్) రేటుపై రూ.30 లక్షలకు ఇండ్ల రుణం తీసుకున్నాడు. దీనిపై ఈఎంఐ రూ.24,907 ఉంటుంది. రూ.30 లక్షల ఇంటి రుణంపై రూ.29.77 లక్షల వడ్డీ పే చేయాల్సి ఉంటుంది. అంటే రూ.30 లక్షల రుణం తీసుకుంటే మొత్తం రూ.59.77 లక్షలు పే చేయాలన్న మాట. సత్య ప్రకాశ్ ఇంటి లోన్ తీసుకున్న తర్వాత ఆర్బీఐ రెపోరేట్ 0.25 శాతం పెంచేసింది. అటుపై అతడి స్నేహితుడు ప్రద్యుమ్న.. అదే బ్యాంక్‌కు వెళితే.. బ్యాంకు అధికారులు వడ్డీరేటు 7.90 నుంచి 8.15 శాతానికి పెరిగిందని చెప్పారు. అలా ప్రద్యుమ్న 20 ఏండ్లకు రూ.30 లక్షల రుణం తీసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ.25,374. ఇది సత్య ప్రకాశ్ ఈఎంఐ కంటే రూ.467 ఎక్కువ. దీంతో ప్రద్యుమ్న 20 ఏండ్లలో రూ.60.90 లక్షలు లోన్ పే చేయాలి.. అంటే సత్య ప్రకాశ్ పే చేసేదానికంటే రూ.1.13 లక్షలు ఎక్కువ.
ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు రెండు రకాలుగా ఉంటాయి. ఫిక్స్డ్, ఫ్లోటర్ రేట్ ఆధారంగా బ్యాంకులు ఇండ్ల రుణాలిస్తాయి. ఫిక్స్డ్ రేట్‌పై ఇండ్ల రుణం తీసుకున్న వారి వడ్డీరేటు ప్రారంభం నుంచి చివరి వరకు ఒకేలా ఉంటుంది. రెపోరేట్ మార్పులతో దీనికి సంబంధం లేదు. కానీ ఫ్లోటర్ వడ్డీరేట్‌పై ఇండ్ల రుణం తీసుకుంటే రెపోరేట్ మారినప్పుడల్లా వడ్డీరేట్ మారుతుంది. ఒకవేళ మీరు ఫ్లోటర్ వడ్డీరేటుపై ఇంటి రునం తీసుకుంటే నెలవారీ ఈఎంఐ పెరుగుతుందన్నమాట.
ఉదాహరణకు మీరు యాక్సిస్ బ్యాంకులో ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం.. ప్లోటింగ్ రేట్‌పై లోన్ తీసుకుంటే 8.75 నుంచి 9.15 శాతం వడ్డీ పే చేయాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ వడ్డీరేటుపై రుణం తీసుకుంటే.. మొత్తం రుణంపై 14 శాతం వడ్డీ చెల్లించాలి. ద్రవ్యోల్బణం నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ మధ్య సమతుల్యత పాటించేలా ఆర్బీఐ రెపోరేట్ 25 బేసిక్ పాయింట్లు పెంచిందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు.