హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): టీ హబ్‌తో కలిసి పనిచేసేందుకుగాను ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్ అబ్దుల్ కలామ్ టెక్నికల్ యూనివర్సిటీ ప్రతినిధుల బృందం ముందుకొచ్చింది. రెండు రోజులపాటు టీ హబ్ కార్యకలాపాలను పరిశీలించిన ప్రతినిధుల బృందం శనివారం..అక్కడ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు టీ హబ్‌తో కలిసి పనిచేయనున్నట్లు అబ్దుల్ కలామ్ టెక్నికల్ యూనివర్సిటీ ప్రతినిధులు ప్రకటించారు.
అంతర్జాతీయ మార్కెట్‌కు అవసరాలకు అనుగుణంగా రూపొందించడంలో టీ హబ్ దూసుకుపోతున్నదని, తమ యూనివర్సిటీలో ఆవిష్కరణలను ప్రోత్సహించేలా త్వరలో ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ప్రైవేట్ రంగంలోని కార్పొరేట్ సంస్థలతోపాటు ప్రభుత్వరంగ సంస్థలు కూడా తమతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని టీ హబ్ ప్రతినిధి వెల్లడించారు. స్టార్టప్‌లకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు టీ హబ్ ద్వారా లభిస్తున్నాయని..అలాగే దేశ, విదేశాలకు చెందిన పలు సంస్థలు సందర్శించడంతో పాటు కలిసి పనిచేసేందుకు వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయని తెలిపారు.