దీపావళి పండుగొస్తున్నది. బంధు మిత్రులకు బహుమతులిచ్చే పర్వదినం ఇది. అయితే వస్తువులే కాకుండా వినూత్నంగా కానుకలు ఇచ్చే ఆలోచనలకు ఇప్పుడు అనేక అవకాశాలు మనముందున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సాధనాలను గిఫ్ట్‌గా ఇస్తే వాటి విలువ పెరుగడంతోపాటు సంక్షోభ సమయాల్లో అవసరానికొస్తాయి. వీటిలో కొన్నింటి విలువ దీర్ఘకాలంలో అనేక రెట్లు పెరుగుతాయి.
ఫిక్స్డ్ డిపాజిట్లు
ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)ను జాయింట్‌గా చేయవచ్చు. బ్యాంకులో నేరుగా నగదును డిపాజిట్ చేసి మీరు ఇవ్వదలచుకున్న వ్యక్తి పేరుతో ఎఫ్డీ చేయవచ్చు. మైనర్లకు ఎఫ్డీని గిఫ్ట్‌గా ఇస్తే దానిమీద వచ్చే వడ్డీని మీ ఆదాయంగానే పరిగణిస్తారు. అయితే మీ బంధువులు కానివారికి ఎఫ్డీని గిఫ్ట్‌గా ఇస్తే దాని వడ్డీ ఆదాయంపై ఐటీ పరిమితులకు లోబడి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పెండ్లి, బర్త్‌డేల వంటి వాటికి రూ.50 వేలకు మించి గిఫ్ట్ ఇస్తే, దాన్ని తీసుకున్నవారికి అది ఐటీ పరిధిలోకి వస్తుంది. గతంలో ఎఫ్‌డీల మీద వడ్డీరేట్లు ఆకర్షణీయంగా ఉన్నప్పుడు చాలామంది మైనర్లకు వీటినే బహుమతిగా ఇచ్చేవారు. ఇక నుంచీ వడ్డీరేట్లు పెరిగే అవకాశాలున్నందున ఎఫ్డీ ఓ మంచి గిఫ్ట్ కాగలదు.
మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటే కొన్ని చట్టపరమైన చిక్కులున్నాయి. షేర్ల మాదిరిగా నేరుగా బదిలీ చేయలేం. అందుకని గిఫ్ట్ ఇవ్వాలనుకున్నవారికి బ్యాంక్ అకౌంట్‌కు డబ్బును బదిలీ చేసి, ఆ అకౌంట్ నుంచి మ్యూచువల్ ఫండ్లు కొనుగోలు చేయవచ్చు. మైనర్ అయితే సంరక్షకునితో కలిపి ఉన్న జాయింట్ అకౌంట్‌కు డబ్బును బదిలీ చేసి మ్యూచువల్ ఫండ్లను కొనుగోలు చేయవచ్చు. అయితే ఇలాంటి నగదు లావాదేవీలతో బహుమానాలను ఇవ్వాలనుకున్నప్పుడు ట్యాక్స్ కన్సల్టెంట్‌ను సంప్రదించడం ఉత్తమం. ఇవేగాకుండా గోల్డ్ ఈటీఎఫ్లయినా వాటిని డీమ్యాట్ అకౌంట్‌కు బదిలీ చేసుకునే వీలున్నది.
షేర్లు
షేర్లను కూడా బహుమానంగా ఇవ్వవచ్చు. అయితే గిఫ్ట్ తీసుకునే వ్యక్తికి కూడా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. మొదట డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ (డీఐఎ)లో ఏ షేరు, ఎన్ని షేర్లను గిఫ్ట్‌గా ఇస్తున్నారో పేర్కొని సంతకం చేసి ఇస్తే సరిపోతుంది. అలాగే షేర్లను తీసుకున్నవారు కూడా రిసిప్ట్ ఇన్స్ట్రక్షన్ సమర్పిస్తే గిఫ్టింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ దగ్గరి బంధువు దగ్గరి నుంచి గిఫ్ట్ తీసుకుంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరుల నుంచి రూ.50 వేలకు మించి విలువైన షేర్లను కానుకగా తీసుకుంటే పన్ను పరిధిలోకి వస్తుంది.
జీవిత బీమా
బంధువులకు జీవిత బీమాను ఐటీ చట్టం సెక్షన్ 80డీ ప్రకారం కొనుగోలు చేసి ఇవ్వవచ్చు. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోతే, మీ మీద ఆర్థిక భారం (ఇన్సూరబుల్ ఇంట్రస్ట్) పడుతుందనుకున్న సందర్భంలో ఈ గిఫ్ట్‌ను ఇవ్వవచ్చు. భార్యభర్తలు, విడాకుల తీసుకున్నవారు, తల్లిదండ్రులు, యుక్తవయసులోని పిల్లలకు జీవిత బీమాను కానుకగా ఇవ్వవచ్చు.