ముంబై, సెప్టెంబర్ 17: దేశంలో విదేశీ మారకం నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఫారెక్స్ రిజర్వులు ఏకంగా 80 బిలియన్ డాలర్లు కరిగిపోయాయి. మన కరెన్సీలో అక్షరాల రూ.6 లక్షల కోట్లకు పైమాటే. గడిచిన ఆరు వారాలుగా తగ్గుతూ వచ్చిన రిజర్వులు గత వారంలోనూ 2 బిలియన్ డాలర్లు తగ్గాయి. దీంతో రిజర్వులు రెండేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు అయింది.
రూపాయి కట్టడికే
రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయడానికి రిజర్వు బ్యాంక్ ఏకంగా భారీ స్థాయిలో డాలర్లను కొనుగోలు చేసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 80 స్థాయికి పతనమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే స్థాయిలో కదలాడుతున్నది. గడిచిన వారాంతానికి గాను ఫారెక్స్ రిజర్వులు 2.234 బిలియన్ డాలర్లు తగ్గి 550.871 బిలియన్ డాలర్లకు పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రూపాయి విలువ 74 స్థాయి నుంచి 80 స్థాయికి పడిపోయింది.