Mahindra XUV 3XO | ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్యూవీ కారు ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (3X0) సరికొత్త రికార్డులు నమోదు చేసింది. త్వరలో మార్కెట్లోకి రానున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ప్రీ బుకింగ్స్ బుధవారం ప్రారంభం అయ్యాయి. ప్రీబుకింగ్స్ ప్రారంభమైన గంటలోనే 50 వేలకు పైగా కార్లను కస్టమర్లు బుక్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా తొలి 10 నిమిషాల్లోనే 27 వేలకు పైగా కార్లు ప్రీ బుకింగ్స్ నమోదయ్యాయని, ఇది తమ న్యూ ఎస్యూవీ పట్ల ప్రజల్లో ఉన్న ఆసక్తికి నిదర్శనం అని మహీంద్రా అండ్ మహీంద్రా ఓ ప్రకటనలో తెలిపింది.
తమ సంస్థ పట్ల కస్టమర్ల విశ్వాసానికి పరీక్షా సమయమని, ప్రీ-బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది సేపట్లోనే 50 వేలకు పైగా బుకింగ్స్ నమోదు కావడం గర్వంగా ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా చెప్పారు. కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఇన్నోవేటివ్ ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నాం అని తెలిపారు. ఈ నెల 26 నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కార్ల డెలివరీ ప్రారంభం అవుతుంది. ఈ కారు ధర రూ.7.49 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.