న్యూఢిల్లీ, జనవరి 18: ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.458 కోట్ల నికర లాభాన్ని గడించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, నికర వడ్డీ ఆదాయం పెరగడం వల్లనే లాభాల్లో 64 శాతం వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.279 కోట్ల లాభాన్ని గడించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.6,523.78 కోట్ల నుంచి రూ.7,635.71 కోట్లకు చేరుకున్నట్ల బీఎస్ఈకి సమాచారం అందించింది. వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం 20 శాతం అధికమై రూ.3,285 కోట్లుగా నమోదైందని పేర్కొంది. ఏడాది క్రితం 15.16 శాతంగా ఉన్న బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ గత త్రైమాసికానికిగాను 8.85 శాతానికి దిగొచ్చాయి. అటు నికర ఎన్పీఏ కూడా 4.39 శాతం నుంచి 2.09 శాతానికి తగ్గింది.