New Bank Branches | గత తొమ్మిదేండ్లుగా దేశంలో డిజిటల్ చెల్లింపులు 100 రెట్లు పెరిగాయని కేంద్రం చెబుతున్నది. డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నా.. వివిధ బ్యాంకుల శాఖల సంఖ్య తగ్గడం లేదు. తద్భిన్నంగా బ్యాంకుల శాఖలు పెరుగుతున్నాయి. బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ బ్యాంక్ బజార్ కథనం ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో కొత్తగా 3,884 శాఖలు పెరిగాయి. వీటిల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, రూరల్ బ్యాంకులు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు కూడా ఉన్నాయి. 2021-22లో 1,54,758 బ్యాంకు శాఖలు పని చేస్తుండగా, 2022-23 మార్చి నెలాఖరు నాటికి వాటి సంఖ్య 1,58,642లకు చేరింది.
పలు ప్రైవేట్ బ్యాంకులు తమ సేవలను చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఇంటి రుణాలు, అతిపెద్ద పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తమ బ్యాంకు శాఖలను సందర్శిస్తున్నారు. ఆన్ లైన్ లావాదేవీలు జరుగుతున్నా సీనియర్ సిటిజన్లు బ్యాంకు శాఖల్లో లావాదేవీలకే మొగ్గుతున్నారు. చాలా మంది లాకర్ ఫెసిలిటీ కోసం బ్యాంకుల శాఖలు అవసరం అని భావిస్తున్నారు.
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వచ్చే రెండేండ్లలో ప్రతిఏటా టైర్-2, టైర్-3, టైర్-4 నగరాల్లో 1200-1300 శాఖలు ప్రారంభించాలని నిర్ణయించింది. గతేడాది బ్యాంకు శాఖలు 23 శాతం పెరిగాయి. బంధన్ బ్యాంకు శాఖలు దాదాపు 500 పెరిగాయి. ఇతర బ్యాంకులు సైతం టైర్-2 నుంచి టైర్-4 సిటీల వరకు శాఖలు విస్తరిస్తున్నాయి.