న్యూఢిల్లీ, నవంబర్ 15: దేశంలో ఆన్లైన్లో షాపింగ్ చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారు. ఇంటి నుంచే అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉండటంతో ఎగబడి కొనుగోళ్ళు చేస్తున్నారు. పండుగ సీజన్లో ఈ-కామర్స్ సంస్థలు కూడా భారీగా ఆఫర్లు ప్రకటించడం కూడా కలిసొస్తున్నది. దేశీయంగా స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం కూడా ఆన్లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్య పెరుగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. వచ్చే ఐదేండ్లకాలంలో ఆన్లైన్ షాపింగ్ విలువ రెండున్నర రెట్లు పెరిగి 500 బిలియన్ డాలర్ల(రూ.37 లక్షల కోట్లు)కు చేరుకునే అవకాశాలు ఉన్నాయని బెంగళూరుకు చెందిన రెడ్సీర్ సర్వే వెల్లడించింది.
వచ్చే ఐదేండ్లలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కొత్తగా 2.4 కోట్ల కుటుంబాలు ఆన్లైన్ షాపింగ్ చేయనున్నారని అంచనా
ప్రస్తుతం ఒక్కో కుటుంబం ఏడాదికి 13-14 వేల డాలర్లు ఆన్లైన్ షాపింగ్ కోసం ఖర్చు చేస్తుండగా..2026 నాటికి 19-20 వేల డాలర్లకు చేరుకోనున్నది.
వచ్చే ఐదేండ్లలో ఆన్లైన్ షాపింగ్ దేశాల జాబితాలో భారత్ రెండో స్థానాన్ని అక్రమించనున్నది. 2.5 కోట్ల మందితో అమెరికా తొలి స్థానంలో ఉన్నది.
ఆన్లైన్ షాపింగ్ చేస్తున్న వారిలో 45 శాతం మంది పెడుతున్న ఖర్చు టాప్-50 నగరాలకు చెందిన వారు.