ముంబై, ఏప్రిల్ 7: గత కొన్ని వారాలుగా భారీగా పుంజుకున్న విదేశీ మారకం నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. మార్చి నెలతో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 329 మిలియన్ డాలర్లు తగ్గి 578.45 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. పసిడి రిజర్వులు తగ్గడం ఇందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది. అంతక్రితం వారంలో రిజర్వులు 5.977 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. మొత్తంమీద గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఫారెక్స్ రిజర్వులు 28.86 బిలియన్ డాలర్లు తరిగిపోయాయి.
విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 36 మిలియన్ డాలర్లు తగ్గి 509.691 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు తెలిపింది. డాలర్తోపాటు యూరో, పౌండ్, యెన్ కరెన్సీలు హెచ్చుతగ్గుదలకు లోనుకావడం వల్లనే రిజర్వులు తగ్గాయని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. గత వారంలో బంగారం రిజర్వులు 279 మిలియన్ డాలర్లు కరిగిపోయి 45.20 బిలియన్ డాలర్లకు తగ్గడం ఇందుకు కారణమని తెలిపింది. అక్టోబర్ 2021లో రిజర్వులు రికార్డు స్థాయి 645 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే.