హైదరాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ బిజినెస్): రాష్ర్టానికి చెందిన యూనికార్న్ స్టార్టప్ డార్విన్‌బాక్స్..అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో గ్లోబల్ ఆఫీస్‌ను ప్రారంభించింది. 75 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయంలో వెయ్యి మంది సిబ్బంది కూర్చోవడానికి వీలుంటుంది. ప్రాంతీయంగా ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా ఇప్పటికే 700 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నట్లు, వచ్చే ఆరు నెలల్లో మరో 300 మందిని నియమించుకోనున్నట్లు కంపెనీ కో-ఫౌండర్ రోహిత్ చెన్నమనేని ఈ సందర్భంగా తెలిపారు.
అంతర్జాతీయ ఐటీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ గ్లోబల్ సెంటర్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థకు భారత్‌తోపాటు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, యూఏఈ, అమెరికాలో 1,200 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అలాగే, హైదరాబాద్‌లో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు స్కూట్ర ఇండియా ప్రకటించింది.
మూడేండ్లలో ఐపీవోకి
వచ్చే మూడేండ్లలో ఐపీవోకి రాబోతున్నట్లు రోహిత్ ప్రకటించారు. వ్యాపార విస్తరణకోసం అవసరమైన నిధులను మార్కెట్లో లిస్ట్ చేయడం ద్వారా సేకరించాలనుకుంటున్నట్లు, ముఖ్యంగా అంతర్జాతీయంగా తమ వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకుంటున్నట్లు చెప్పారు.