ముంబై, మే 25: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైననాటి నుంచి ఇప్పటి వరకు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తరలించుకుపోయారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని అంచనాలు వెల్లడికావడంతో విదేశీ మదుపరుల్లో ఆందోళన మరింత పెరిగింది. లోకసభ ఎన్నికలు ప్రారంభమైన ఏప్రిల్ 19 నుంచి ఇప్పటి వరకు 21 రోజుల్లో రూ.37,700 కోట్లను ఉపసంహరించుకున్నారు. నికరంగా రోజు కు రూ.1,800 కోట్లకు పైగా పెట్టుబడులను తరలించుకుపోయినట్లు అయింది. ఇండియా వీఐఎక్స్ సూచీ రికార్డు స్థాయిలో 67 శాతం పెరగడం వల్లనే విదేశీ మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది.