ITR Filing | గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 31. ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయడానికి మూడు రోజుల టైం మాత్రమే మిగిలి ఉంది. గురువారం (జూలై 27) వరకు ఐదు కోట్లకుపైగా ఐటీ రిటర్న్స్ ఫైల్ కాగా, వాటిలో 4.46 కోట్ల ఐటీఆర్ లు వెరిఫై అయ్యాయి. 73 శాతం మంది పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేశారని లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో తేలింది. మరో 27 శాతం మంది ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉండగా, వారిలో 14 శాతం మంది ఈ నెలాఖరులోగా ఐటీఆర్ పైల్ చేయలేమని చెప్పేశారు.
ఐటీ రిటర్న్స్ దాఖలుపై ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ‘లోకల్ సర్కిల్స్’ దేశవ్యాప్తంగా 315 జిల్లాల్లోని 12 వేల మంది భారతీయుల అభిప్రాయాలు సేకరించింది. వారిలో 41 శాతం మంది టైర్-1 సిటీస్, 32 శాతం మంది టైర్-2 నగరాలు, 27 శాతం మంది టైర్-3 అండ్ 4 నగరాలు, గ్రామీణ జిల్లాల వాసులు ఉన్నారు.
గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేయడం కష్టమేనని ఐదు శాతం మంది చెబుతున్నారు. సాంకేతిక సమస్యలతో మధ్యలోనే ప్రాసెస్ నిలిచిపోయిందని, గడువు లోపు మళ్లీ ప్రయత్నిస్తామంటున్నారు. కొన్ని వారాల క్రితం అడ్వాన్స్ టాక్స్, సెల్ఫ్ అసెస్ మెంట్ టాక్స్ వివరాలు తమ ఏఐఎస్ నుంచి మిస్ అయ్యాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. మరి కొంత మంది సోషల్ మీడియా వేదికలపై తమ ఇబ్బందులపై ఫిర్యాదులు చేస్తున్నారు. మరో తొమ్మిది శాతం మంది గడువు లోపు ఐటీఆర్ ఫైలింగ్ అసాధ్యమేనని తేల్చి చెబుతున్నారు.
ఏడెనిమిది రాష్ట్రాల పరిధిలో అతి భారీ వర్షాలు కురవడంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసోం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో యమునా నది మహోగ్రరూపం దాల్చడంతో వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వరదలు పోటెత్తుతున్నాయి.
వరదలతో కరంట్ కొరత తదితర కారణాల రీత్యా ఐటీఆర్ లు దాఖలు చేయడానికి కనీసం రెండు వారాల గడువు ఇవ్వాలని సర్వేలో పాల్గొన్న అత్యధిక మంది చెప్పారు. అయితే, గత వారం కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాత్రం ఈ నెలాఖరులోగా ఐటీఆర్ దాఖలు చేయాల్సిందేనని తేల్చేశారు.