EPFO | ఈ ఏడాది మార్చిలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో కొత్తగా 14.58 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఈ సంఖ్య గత సంవత్సరం కంటే 1.15 శాతం ఎక్కువ. మార్చి నెలలోనే దాదాపు 7.54 లక్షల మంది ఈపీఎఫ్‌లో తొలిసారిగా పేరు నమోదు చేసుకున్నారు. ఇది ఫిబ్రవరి కంటే 2.03 శాతం ఎక్కువ. అదే సమయంలో మార్చి 2024తో పోలిస్తే వార్షిక వృద్ధి 0.98 శాతంగా నమోదైంది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ బుధవారం ఈపీఎఫ్‌లో సభ్యుల నమోదు పెరుగుతోందని తెలిపింది. ఇది ఉపాధి అవకాశాల పెరుగుదల, ఉద్యోగి ప్రయోజనాల గురించి పెరుగుతున్న అవగాహనను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. 18-25 సంవత్సరాల మధ్య వయస్కులు 4.45లక్షల మంది కొత్తగా సభ్యులుగా చేరారు. 2025 మార్చిలో చేరిన మొత్తం కొత్త సభ్యుల్లో 58.94 శాతం కాగా.. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో ఈ వయసు కేటగిరిలో కొత్త సభ్యుల సంఖ్య 4.21 శాతం పెరిగింది.
అదే సమయంలో 2024 మార్చితో పోలిస్తే 4.73 శాతం వృద్ధి నమోదైంది. 18-25 ఏళ్ల వయసు వారిలో నికర జీతం మార్చిలో దాదాపు 6.68 లక్షలు పెరిగింది. గతేడాది మార్చితో పోలిస్తే 6.49 శాతం ఎక్కువ అని మంత్రిత్వశాఖ వివరించింది. ఈ ఏడాది మార్చిలో ముందుగా వెళ్లిపోయిన దాదాపు 13.23లక్షల మంది సభ్యులుగా మళ్లీ ఈపీఎఫ్‌లో చేరారు. ఈ సంఖ్య ఈ ఏడాది ఫిబ్రవరి కంటే 0.39 శాతం ఎక్కువ. అదే సమయంలో మార్చి 2024తో పోలిస్తే వార్షిక పెరుగుదల 12.17 శాతంగా ఉంది. ఈ ఏడాది మార్చిలో దాదాపు 2.08 లక్షల మంది మహిళలు కొత్తగా సభ్యులుగా చేరారు. ఇది ఫిబ్రవరిలో కంటే 0.18 శాతం ఎక్కువ. మార్చి 2025లో మహిళల నికర జీతం దాదాపు 2.92 లక్షలు పెరిగింది. ఇది గత సంవత్సరం కంటే 0.78 శాతం ఎక్కువ. మహిళా సభ్యుల భాగస్వామ్యం పెరగడం మరింత సమ్మిళితమైన, వైవిధ్యమైన శ్రామిక శక్తి వైపు ప్రయాణిస్తున్నామనేదానికి సంకేతమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.