న్యూఢిల్లీ, ఆగస్టు 1: జూలైలో నెలలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు 11 శాతం వృద్ధిచెంది రూ. 1.65 లక్షల కోట్లకు చేరాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఈ ఆదాయం రూ.1.60 లక్షల కోట్ల స్థాయిని అధిగమించడం వరుసగా ఇది ఐదో నెల. జూలైలో మొత్తం రూ. 1,65,105 కోట్లు జీఎస్టీ పన్నుల ద్వారా వసూలుకాగా, అందులో రూ.29,773 కోట్లు సెంట్రల్ జీఎస్టీ కింద, రూ. 37,623 కోట్లు స్టేట్ జీఎస్టీ, రూ.85,930 కోట్లు ఇంటర్నేషనల్ జీఎస్టీతో (దిగుమతుల ద్వారా వసూలైనవి) సమకూరినట్టు మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. సెస్ రూపంలో రూ.11,779 కోట్లు వచ్చాయి. 2022 జూలైలో వసూలైన రూ.1.49 లక్షల కోట్లకంటే ఈ ఏడాది జూలైలో 11 శాతం పెరిగినట్టు ప్రకటన తెలిపింది. 2023 జూన్‌లో రూ.1.61 లక్షల కోట్లు, మే నెలలో రూ.1.57 లక్షల కోట్ల జీఎస్టీ పన్నుల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్ల రికార్డు వసూళ్లు జరిగాయి.
ఇండ్లు, కార్ల కొనుగోలే కారణం
వినియోగదారులు ఇండ్లు, కార్లు, ఇతర వినియోగ వస్తువులను జోరుగా కొనుగోలు చేయడం, విహారయాత్రల ద్వారా ఖర్చుచేయడంతో జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు వృద్ధిచెందాయని ఎన్ఏ షా అసోసియేట్స్ పార్టనర్ పరాగ్ మెహతా చెప్పారు. అలాగే జీఎస్టీఎన్ నెట్వర్క్ పన్ను ఎగవేతదార్లను తొలిదశలోనే గుర్తించడం, ఎప్పటికప్పుడు పన్ను ఎగవేతదార్లపై దాడులు జరపడం, నకిలీ ఇన్వాయిస్లపై కొరడా ఝుళిపించడం, పరిశ్రమ సమస్యలపై జీఎస్టీ కౌన్సిల్ తరచూ వివరణలివ్వడం వంటి అంశాలు వసూళ్ల మెరుగుదలకు దోహదపడ్డాయని మెహతా వివరించారు. పండుగల సీజన్ రానున్నందున, వచ్చే నెలల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని కేపీఎంజీ ఇండియా నేషనల్ హెడ్ అభిషేక్ జైన్ అంచనా వేశారు.
నేడు జీఎస్టీ కౌన్సిల్ భేటీ
ఆన్‌లైన గేమింగ్, క్యాసినోలపై 28 శాతం జీఎస్టీని విధించేందుకు తగిన విధివిధానాలను ఖరారు చేయడానికి బుధవారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వివిధ రాష్ర్టాల మంత్రులతో కూడిన కౌన్సిల్ భేటీ ఇంతకుముందు జూలై 11న జరిగింది. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్‌లో జరిగే బెట్టింగ్‌పై ముఖవిలువపై 28 శాతం జీఎస్టీ విధింపునకు గత సమావేశం ఆమోదముద్ర వేసింది. ఈ పన్నుల్ని ఎలా గణించాలన్న అంశమై కేంద్ర, రాష్ర్టాల పన్ను అధికారులతో కూడిన లా కమిటీ ముసాయిదా నిబంధనల్ని రూపొందించింది. వీటిని తాజాగా జరిగే జీఎస్టీ భేటీలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు.
తెలంగాణలో వసూళ్లు రూ. 4,849 కోట్లు
తెలంగాణ రాష్ట్రంలో 2023 జూలైలో రూ. 4,849 కోట్ల మేర వస్తు, సేవల పన్నులు వసూలయ్యాయి. 2022 జూలైలో నమోదైన రూ.4,547 కోట్లతో పోలిస్తే తెలంగాణలో తాజాగా ముగిసిన నెలలో జీఎస్టీ ఆదాయం 7 శాతం వృద్ధిచెందింది.