PAN-Aadhar Link | గడువులోగా ఆధార్ కార్డుతో అనుసంధానించని 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివ్ అయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. దేశవ్యాప్తంగా 70.24 కోట్ల పాన్ కార్డు హోల్డర్లు ఉండగా, 57.25 కోట్ల మంది మాత్రమే తమ ఆధార్ కార్డును అనుసంధానించారు. పాన్-ఆధార్ కార్డుల అనుసంధానానికి జూన్ 30 తుది గడువుగా సీబీడీటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2017 జూలై కంటే ముందు జారీ చేసిన పాన్ కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానించాలని ఇంతకుముందే కేంద్రం నిర్ణయించింది.
కాగా, మధ్యప్రదేశ్ ఆర్టీఐ కార్యకర్త శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్పై సీబీడీటీ స్పందించింది. గడువులోగా అనుసంధానించని 11.5 కోట్ల పాన్ కార్డులను డీ యాక్టివేట్ చేశామని పేర్కొంది. అయితే డీయాక్టివేట్ చేసిన పాన్ కార్డుల పునరుద్ధరణకు సీబీడీటీ అవకాశం కల్పిస్తున్నది. 2023 జూన్ 30 లోపు పాన్ కార్డు-ఆధార్ అనుసంధాన ప్రక్రియ చేపట్టని వారు తిరిగి రూ.1000 పెనాల్టీ చెల్లించి యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే, రూ.1000 చెల్లించి పునరుద్ధరించుకున్న పాన్ కార్డు.. వినియోగంలోకి రావడానికి నెల రోజులు పడుతుంది. అప్పటి వరకూ సదరు పాన్ కార్డు.. ఆర్థిక లావాదేవీలకు వినియోగించడానికి సీబీడీటీ అనుమతించదు.