న్యూఢిల్లీ, జూలై 12: భారత్ కరెంట్ ఖాతా లోటు (దేశంలోకి వచ్చి, పోయే విదేశీ మారకం మధ్య వ్యత్యాసం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 105 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా (బొఫా) సెక్యూరిటీస్ అంచనా వేసింది. ఇది దేశ జీడీపీలో 3 శాతం. ముఖ్యంగా వాణిజ్యలోటు విస్త్రతమవుతున్నందున కరెంట్ ఖాతా లోటు కూడా పెరుగుతుందని బొఫా తెలిపింది. ఈ జూన్ నెలలో వాణిజ్యలోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) రికార్డుస్థాయిలో 25.6 బిలియన్ డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. అలాగే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇది 70.33 బిలియన్ డాలర్లకు పెరిగింది. వాణిజ్యలోటు అదేపనిగా పెరుగుతున్నందున, కరెంట్ ఖాతా లోటు అంచనాల్ని 0.4 శాతం మేర పెంచామని బొఫా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 2.6 శాతంగా (90 బిలియన్ డాలర్లు) ఉన్న ఈ లోటు ప్రస్తుత ఏడాది 105 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నది.