హైదరాబాద్/ముంబై, సెప్టెంబర్ 4 : దేశంలో జియో డాటా విప్లవానికి నాంది పలికి నేటికి పదేండ్లు పూర్తవుతున్నది. 2016 సెప్టెంబర్ 5న జియో వాణిజ్య సేవలను ప్రారంభించింది. ఈ పదేండ్లలో వినియోగదారులు ఇంటర్నెట్ను పొదుపుగా వాడాల్సిన స్థితి నుంచి నెట్వర్క్స్, పరికరాలు, సంస్థలను నడిపించే వ్యవస్థలను నిర్మించే స్థాయికి భారత్ చేరిందని ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో జియో పేర్కొన్నది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ టెలికాం సర్కిల్లో రిలయన్స్ జియో చందాదారుల సంఖ్య 3.25 కోట్లకు చేరిందన్నది. 39.9 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు నమోదైందని తెలిపింది. 2016లో భారత్‌లో ఒక్కో యూజర్ సగటు నెలవారీ మొబైల్ డాటా వినియోగం 0.2 జీబీ కంటే తక్కువగా ఉండేది. పైగా ఒక జీబీ డాటాకు సుమారు రూ.228గా వెచ్చించాల్సి వచ్చేది. విస్తృత స్థాయిలో హైస్పీడ్ యాక్సెస్ దాదాపుగా అందుబాటులో లేదు. దేశంలో అప్పుడు 4జీ నెట్వర్క్ యాక్సెస్ ఉన్న భారతీయుల సంఖ్య కోటి కంటే తక్కువ. సగటు డౌన్లోడ్ వేగం కూడా 2.5 ఎంబీపీఎస్ దాటలేని పరిస్థితి. కానీ జియో రాకతో ఇవన్నీ మారిపోయాయి.
2026 నాటికి ఒక జీబీ డాటా ధర సుమారు 97 శాతం తగ్గి దాదాపు రూ.7.9కి చేరింది. భారత్‌లో యాక్టివ్ హైస్పీడ్ 4జీ, 5జీ యూజర్ల సంఖ్య సుమారు 93.8 కోట్లకు చేరింది. ఇప్పుడు ఒక్కో చందాదారు నెలకు సగటున 42.3 జీబీ డాటాను వినియోగిస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ-ఏపీ సర్కిల్లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన తొలి నెలలోనే 12.4 లక్షల మంది వినియోగదారులను నమోదు చేసుకుంది. గత పదేండ్లలో ఈ సంఖ్య 3.25 కోట్లకు చేరింది. మొత్తం 8.83 కోట్ల వైర్లెస్ కనెక్షన్లలో 36.9 శాతం వాటాను జియో కలిగి ఉన్నదని ఆ సంస్థ వెల్లడించింది.
తక్కువ ధర కలిగిన ప్లాన్స్ వల్లనే జియో మార్కెట్ విస్తరించింది. రెండు తెలుగు రాష్ర్టాల్లోని గ్రామీణ, సెమీ అర్బన్, తక్కువ ఆదాయ వర్గాలకు జియో కొత్తగా కనెక్టివిటీని అందించిందని, దీంతో తొలిసారిగా కోట్లాది మంది వినియోగదారులు డిజిటల్ వ్యవస్థలోకి వచ్చారని సంస్థ చెప్తున్నది. డాటా ధరలు భారీగా తగ్గడం వల్ల రోజువారీ జీవితంలో డిజిటల్ కనెక్టివిటీ ఇప్పుడు సహజమైన, తప్పనిసరి అంశంగా మారింది. నేడు మారుమూల ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు కూడా యూపీఐ పేమెంట్స్ ద్వారానే లావాదేవీలు సాగిస్తున్నారు. ఇందులో జియో సేవలను తీసిపారేయలేం. కరోనా సమయంలో ఆన్లైన్ విద్యకూ దోహదం చేసింది. ఇక చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ కోట్లాది మంది ప్రేక్షకులను రీచ్ అవుతున్నారు.
గతంలో టెలికాం పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో భారత్ వెనుకపడేది. 4జీ సాంకేతికత 2009 ప్రాంతంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైనా.. భారత్‌ను చేరేందుకు ఎనిమిదేండ్లు పట్టింది. 2016 చివరలో జియో రాకతో అది వేగం పుంజుకున్నది. అయితే 5జీ విషయంలో ఆ అంతరాన్ని జియో పూర్తిగా తగ్గించింది. 5జీ వాణిజ్య విస్తరణ ప్రపంచవ్యాప్తంగా 2019 సమయంలో ప్రారంభమవగా, జియో 2022 చివరలో ప్రారంభించింది. కేవలం 15 నెలల్లోనే దేశవ్యాప్తంగా 5జీ కవరేజీని పూర్తి చేసింది. 42 నెలల్లోనే సుమారు 26.8 కోట్ల 5జీ వినియోగదారులను సాధించినట్టు పదేండ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా జియో పేర్కొన్నది.