తపాలా శాఖ అందిస్తున్న రకరకాల స్కీముల్లో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (టీడీ) స్కీం ఆకర్షణీయం. ఇదికూడా ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)లాగే ఉంటుంది. నిర్దిష్ట మొత్తాలు డిపాజిట్ చేస్తే.. దానిపై వడ్డీ వస్తుంది. సురక్షిత పెట్టుబడి సాధనాలను కోరుకునేవారికి అనువైనది. కాగా, 1, 2, 3 లేదా ఐదేండ్ల కాలపరిమితుల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. కానీ ఇందులో 5 ఏండ్ల ప్లాన్‌కు డిమాండ్ ఉన్నది. అధిక రాబడులేగాక, ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఐటీ మినహాయింపులనూ పొందవచ్చు.
ఇక వడ్డీ 3 నెలలకోసారి లెక్కించి, వార్షిక ప్రాతిపదికన చెల్లిస్తారు. ప్రస్తుతం ఏడాది డిపాజిట్‌పై వార్షిక వడ్డీరేటు 6.9 శాతంగా ఉన్నది. అలాగే 2 ఏండ్లపై 7 శాతం, 3 ఏండ్లపై 7.1 శాతం, 5 ఏండ్ల టీడీపై గరిష్ఠంగా 7.5 శాతం వడ్డీరేటున్నది. 5 ఏండ్ల టీడీలో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టినైట్టెతే ఆఖర్లో దాదాపు రూ.7.21 లక్షలు అందుకోవచ్చు. అయితే మరో ఐదేండ్లు ఈ మొత్తాన్ని అలాగే ఉంచితే చివరకు రూ.10.40 లక్షలు తీసుకోవచ్చు.