హైదరాబాద్, డిసెంబర్ 17: భారతీయ తేయాకు వేలాల్లో కేఫ్ నీలోఫర్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. అత్యుత్తమ నాణ్యత కలిగిన టీ గార్డెన్లలో ఒకటైన మనోహరి గోల్డ్ టీ కోసం మునుపెన్నడూ లేనివిధంగా భారీ బిడ్‌ను దాఖలు చేసింది. దీంతో ప్రైవేట్ యాక్షన్ పోర్టల్ ‘టీ ఇన్‌టెక్’ చరిత్రలో టీ పరిశ్రమలోని సంస్థలు గతంలో సృష్టించిన రికార్డులన్నీ కనుమరుగైపోయాయి. ఈ నెల 16న జరిగిన ఈ వేలంలో కిలో టీపొడికి ఏకంగా రూ.1,15,000 ఇచ్చి కొనేందుకు కేఫ్ నీలోఫర్ ముందుకొచ్చి విజయం సాధించింది. ఈ క్రమంలోనే జనవరి 1 నుంచి తమ బంజారాహిల్స్ కేఫ్ నీలోఫర్ ప్రీమియం లాంజ్, హిమాయత్‌నగర్‌లోని కేఫ్ నీలోఫర్‌లలో ఈ టీ లభిస్తుందని సంస్థ తాజాగా ప్రకటించింది.
కాగా, 2018 నుంచి ఈ ప్రత్యేక వేలాలు అస్సాంలో జరుగుతున్నాయి. అయితే ఇప్పటిదాకా ఇదే అత్యధిక ధర కావడం విశేషం. 2021 డిసెంబర్లో జరిగిన వేలంలో కిలో మనోహరి గోల్డ్ టీపొడి రూ.99,999 పలికింది. ఈసారి ధరతో ఈ రికార్డు చెరిగిపోయింది. 2020లో కిలో రూ.75,000, 2019లో రూ.50,000, 2018లో రూ.39, 100 ధర నమోదైంది. అస్సాంలోని దిబ్రూగఢ్‌కు చెందిన అరుదైన తేయాకు రకం మనోహరి గోల్డ్ టీ. అత్యంత మేలుజాతి రకమైన పీ-126 తేయాకుతో ఈ గోల్డ్ టీ ఉంటుంది. ఈ తేయాకుతో ప్రపంచంలోనే అత్యుత్తమ టీ తయారవుతుందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. అందుకే దీనికింత డిమాండ్ అంటున్నారు. కాగా, ఇందులోని యాంటీఆక్సిడెంట్స్, న్యూట్రియెంట్స్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కేఫ్ నీలోఫర్ నాలు గు దశాబ్దాలకుపైగా నడుస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాదీ చాయ్, బిస్కట్లకు బ్రాండ్‌గా కూడా వెలుగొందుతున్నది.