Nitin Gadkari | నాన్పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపి ఉంచిన వాహనాల ఫొటో పంపితే రూ.500 బహుమతి ( Reward ) అందిస్తామని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రకటించారు. ఇందుకోసం చట్టం తీసుకొస్తామని తెలిపారు. నాన్పార్కింగ్ స్థలంలో వాహనం ఆపిన వ్యక్తిపై ఒకవేళ రూ.1000 ఫైన్ విధిస్తే, అందులో రూ.500 ఫొటోగ్రాఫ్ పంపిన వ్యక్తికి చెల్లిస్తామన్నారు. ఢిల్లీలో ఇండస్ట్రీయల్ డీకార్బనైజేషన్ సమ్మిట్-2022లో ఆయన మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. ఈ విషయమై పార్లమెంట్లో బిల్లు ఆమోదించడం ద్వారా చట్టం తెస్తారా? లేదా? అన్న సంగతి తెలుపలేదు.
దేశవ్యాప్తంగా.. ప్రత్యేకించి పట్టణాల్లో కార్ల రాంగ్ పార్కింగ్.. అధికారులకు, పోలీసులకు, సామాన్యులకు తలనొప్పిగా ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో సభ్యుడికో కారు ఉంటుంది. కానీ బిల్డింగ్‌లో పార్కింగ్ స్పేస్ ఉండదు. దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద రోడ్లన్నీ పార్కింగ్ స్థలాలుగా ప్రజలు భావిస్తున్నట్లు ఉన్నారు అని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.
నాగ్‌పూర్‌లోని తన ఇంట్లో 12 కార్లు పార్క్ చేయడానికి స్పేస్ ఉందని, తానెప్పుడూ బయట రోడ్డుపై పార్క్ చేయలేదన్నారు. భారత్‌లో ప్రజా రవాణాకు విద్యుత్ వాహనాలను వాడటమే తప్పనిసరన్నారు. అమెరికాలో పారిశుద్ధ్య కార్మికులు సైతం కార్లలోనే వస్తారన్నారు. భారత్‌లోనూ ఆ పరిస్థితి రావాలని గడ్కరీ చెప్పారు.