చల్లగా హాయిగొలిపే శీతకాలమంటే చాలా మందికి ఇష్టం. అయితే పొడిబారే చర్మం, నెర్రెలుబారే పాదాలు, పగిలిపోయే పెదాలు ఆ ఆనందాన్ని హరిస్తాయి.ఈ సమస్యలకు చక్కని పరిష్కారం.. పెట్రోలియం జెల్లీ.
చల్లగా హాయిగొలిపే శీతకాలమంటే చాలా మందికి ఇష్టం. అయితే పొడిబారే చర్మం, నెర్రెలుబారే పాదాలు, పగిలిపోయే పెదాలు ఆ ఆనందాన్ని హరిస్తాయి.ఈ సమస్యలకు చక్కని పరిష్కారం.. పెట్రోలియం జెల్లీ.
ఇది పెట్రోలియం నుంచి వచ్చే ఒక ఉత్పత్తి. రోజువారీ చర్మ సంరక్షణకు శుద్ధి చేసిన జెల్లీనే వినియోగించాలి. పెద్ద సంస్థలు అమ్ముతున్న పెట్రోలియం జెల్లీలన్నీ దాదాపు రిఫైన్ చేసినవే.
చలికాలం పెద్దగా దాహం వేయదు. కాబట్టి, నీళ్లు తక్కువ తాగుతాం. దీనికితోడు, బయటి వాతావరణమూ చర్మంలోని తేమను లాగేస్తుంది. ఫలితంగా చర్మం పొడిబారి, పగిలిపోయి ఇబ్బంది పెడుతుంది. ఆ సమస్య రాకుండా రాత్రి పడుకునే ముందు పెట్రోలియం జెల్లీని ముఖం, చేతుల మీద రాయాలి. అది చర్మం మీద పొరలా ఏర్పడి, తేమను బయటికి వెళ్లనివ్వదు.
ఈ సమయంలో పెదవులు చిట్లినట్టు అవుతాయి. నొప్పి, మంట ఇబ్బంది పెడతాయి. అలాంటప్పుడు కొద్దిగా పెట్రోలియం జెల్లీ తీసుకుని పెదవుల మీద మృదువుగా మర్దన చేస్తే నాలుగైదు రోజుల్లో మెత్తబడతాయి.
కాళ్ల పగుళ్లకు పెట్రోలియం జెల్లీ మంచి మందు. పడుకునే ముందు శుభ్రంగా కాళ్లు కడుక్కుని పొడిగా తుడిచి, జెల్లీ రాస్తే ఈ సమస్య దూరం అవుతుంది.
కళ్లచుట్టూ నల్లని వలయాలు లేదా కళ్ల ఉబ్బరం ఉన్నప్పుడు కొంచెం జెల్లీని దూది మీద వేసుకుని కళ్ల కింది భాగంలో రాసుకుని.. పదినిమిషాల తర్వాత కడిగేయాలి. కనుబొమల మీద మర్దన చేస్తే మరింత ఒత్తుగా అవుతాయి.
చిన్న చిన్న గాయాలకు పెట్రోలియం జెల్లీ మంచి మందు. గీసుకుపోయినా, కోసుకున్నా.. త్వరగా మానుతుంది.