వంటల్లో సువాసనకోసం వాడే ‘పాండన్’ ఆకులు అందానికి, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ‘వెనిలా ఆఫ్ ది ఈస్ట్’గా పేరొందిన ఈ పత్రాలను ‘అన్నపూర్ణ ఆకులు’ అనీ పిలుస్తారు.
వీటిలో పోషకాలు, ఔషధ గుణాలు పుష్కలం.
కాలిన గాయాలకు, చర్మ సమస్యలకు పాండన్ ఆకుల రసం ఓషధిలా పనిచేస్తుంది. చెమట పొక్కులు, దురద వంటి సమస్యలను నివారిస్తుంది. ఈ ఆకుల రసాన్ని వేడినీటిలో కలిపి కాస్త ఉప్పు వేసుకుని తాగితే, వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఘాటైన వాసనవల్ల క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. రసాన్ని నీళ్ళలో కలిపి ఇంటి మూలల్లో చల్లితే బొద్దింకలు, దోమలు, ఈగలు వంటి హానికర కీటకాలు రాకుండా ఉంటాయి.
ఫేస్‌ప్యాక్‌తో ఈ రసాన్ని జోడించడం వల్ల చర్మం నిగారింపు పెరుగుతుంది. జుట్టురాలడం, చుండ్రు వంటి కేశ సమస్యలకు పాండన్ ఆకులు చక్కని పరిష్కారం. ఆకులను ఎండబెట్టి, పొడి చేసి, ఆ పొడిని నీళ్లల్లోగానీ కొబ్బరినూనెలోగానీ కలిపి కుదుళ్ళకు బాగా పట్టించి తలస్నానం చేస్తే ఒత్తయిన జుత్తు మీ సొంతం.
మలబద్ధకం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను నియంత్రించడంలోనూ పాండన్ ఆకులు సాయపడతాయి. నిద్రలేమిని, ఒత్తిడిని తరిమికొడతాయి. వీటిలో యాంటీఫంగల్, యాంటీ ఇన్ఫెక్షనల్ గుణాలు అపారం.