కీమోఫోబియా.. చాలామందిని వేధిస్తున్న సమస్య. రోజూ ఉపయోగించే సౌందర్య సాధనాలలోని రసాయనాలు తమ ఆరోగ్యాన్ని, అందాన్ని పాడుచేస్తాయనే విపరీతమైన భయమే.. కీమో ఫోబియాకు మూలం. బ్యూటీ గురువులు కూడా రసాయనాలు నామమాత్రంగా ఉన్న ఉత్పత్తులనే వాడమని చెబుతారు. ప్రస్తుతం, జనం సైతం ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులకే ఓటేస్తున్నారు. కీమోఫోబియా పీడితులు రసాయనాల భయాన్ని వదిలించుకోవడానికి ఈ ఉత్పత్తులను ఎంచుకోవచ్చు.
శీకాకాయ
షాంపూ బదులు శీకాకాయ వాడుకోవచ్చు. ఇది సహజమైన క్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. జుట్టు మీద సున్నితంగా పనిచేయడమే కాకుండా, తల చర్మంలోని నూనెలు ఆరిపోకుండా చేస్తుంది.
హెర్బల్ సబ్బు
మూలికలతో తయారైన సబ్బులు చర్మం మీది గీతలు, దద్దుర్లలాంటి వాటిని తగ్గించి మేనిని కాంతిమంతం చేస్తాయి.
నలుగు పిండి
పెండ్లి మంటపం మీద వధూవరులు మెరిసిపోవాలనే ఉద్దేశంతో.. నలుగు పెట్టి స్నానం చేయిస్తారు. నిజానికి నలుగు చక్కని బాడీ క్లెన్సర్. సాధారణంగా శనగలు, పెసలులాంటి వాటిని నలుగు పిండి తయారీకి వాడతారు. ఇవి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. ఇందులో వాడే పసుపు, చందనం
నిగారింపును తెస్తాయి.
కొబ్బరి నూనె
శుద్ధమైన కొబ్బరి నూనె సౌందర్య రక్షణకు సాయపడుతుంది. మేకప్ తొలగించడానికి, జీవం లేని జుట్టుకు ప్రాణంపోయడానికి, పగిలిన పెదాలకూ, నల్లబడిన మోచేతులకూ మునుపటి సౌకుమార్యం తెచ్చేందుకు దీన్ని ఎంచుకోవచ్చు.
వేపాకులు
మొటిమల నివారణకు చక్కని పరిష్కారం. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న వేపాకులను ముద్దగా చేసి మొటిమలు ఉన్న ప్రాంతంలో రాయాలి. కాసేపాగిన తర్వాత, చల్లటి నీటితో కడిగేయాలి. మొటిమల నివారణకు ఇంతకు మించిన సహజ సిద్ధ మార్గం లేదు.
శనగ పిండి
అరకప్పు శనగపిండి, అరకప్పు పెసరపిండి, అర టేబుల్ స్పూన్ పసుపు, పాలు కలిపిన మిశ్రమాన్ని వారానికోసారి సబ్బుకు బదులు స్నానానికి వాడితే శరీరం మృదువుగా మారి మెరుపును సంతరించుకుంటుంది.